ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విషాదం నెలకొంది. గ్రామంలో ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరు వ్యక్తుల ఆగడాలకు అడ్డు చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ దళిత యువకుడ్ని అతిదారుణంగా చంపేశారు దుండగులు. అతడి చొక్కాతోనే కరెంట్ స్తంభానికి ఉరేసి హత్య చేశారు. అయితే తమ కుమారుడ్ని గ్రామ పెద్దలే హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. కేదారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పచారా గ్రామంలో అక్టోబరు 5న ఓ దళిత మహిళపై ఆ ఊర్లోని పెద్ద మనుషులుగా వ్యవహరించే వ్యక్తులు అఘాయత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం అదే గ్రామానికి చెందిన సేతన్ భూయాన్ అనే యువకుడికి తెలిసింది. దీంతో ఈ అన్యాయాన్ని సహించక అఘాయిత్యానికి పాల్పడిన కుటుంబసభ్యులను నిలదీద్దామని సేతన్ వెళ్లాడు. కానీ వారే తిరిగి అతడి కుటుంబంపైన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సేతన్ జరిగిన విషయం మొత్తాన్ని పోలీసులకు తెలియజేశాడు.
అది జరిగిన తర్వాత సేతన్.. గ్రామ శివార్లలోని పొలంలో విగత జీవిగా కనిపించాడు. అతడి షర్ట్‌తోనే కరెంట్ స్తంభానికి ఉరేసి చంపారు దుండగులు. అయితే గ్రామ పెద్దలే తమ కుమారుడ్ని హత్య చేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని సేతన్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు స్పందించలేదని వాపోతున్నారు. అయితే ఈ ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: స్వదేశీ ఆయుధాలపై భారత్ ప్రత్యేక దృష్టి.. ఇక శత్రుదేశాలకు చుక్కలే
పానీపూరిలు లాగించిన ఏనుగు.. ఒకటి కాదు రెండు కాదు.. నాన్‌స్టాప్‌గా..