కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఇటీవలే జరిగిన గ్రామ దేవత ఉత్సవంలో ఓ దళిత బాలుడు.. అమ్మవారి విగ్రహాన్ని తాకాడని అతడి కుటుంబానికి గ్రామ పెద్దలు రూ.60 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే గ్రామాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
ఇదీ జరిగింది.. జిల్లాలోని మలూరు తాలుకా హుల్లేరహళ్లిలోని భూతమ్మ దేవర ఉత్సవం సెప్టెంబరు 7న జరిగింది. అదే సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, శోభ దంపతుల కుమారుడు చేతన్.. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తాకాడు. వెంటనే గ్రామపెద్దలు.. పంచాయతీ ఏర్పాటు చేసి బాలుడి కుటుంబానికి రూ.60 వేలు జరిమానా వేశారు. జరిమనా చెల్లించకపోతే గ్రామం నుంచి బహిష్కరిస్తామని తెలిపారు.
అయితే ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత దళిత సంఘాల నాయకులు.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి సెప్టెంబరు 20న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..దళిత కుటుంబానికి జరిమానా విధించిన మొత్తం ఎనిమిది మందిని గ్రామపెద్దలను అరెస్టు చేశారు. అనంతరం భూతమ్మ గుడి తాళం పగలగొట్టి చేతన్ కుటుంబాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి ప్రార్థనలు చేయించారు.
ఇవీ చదవండి: గ్రామంలోకి మొసలి.. స్థానికులు హడల్.. 3గంటల పాటు శ్రమించి..
కొడితే 'వజ్రాల బుట్ట'లో పడడమంటే ఇదేనేమో!.. రాత్రికి రాత్రే లక్షాధికారులుగా..