దేశంలో కరోనా మూడో దశ(Thirdwave of Corona) అక్టోబరు-నవంబరు మధ్య ఉద్ధృతంగా ఉండొచ్చని ఐఐటీ- కాన్పుర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న వైరస్ రకాలను(Coronavirus Variants) మించి తీవ్రమైన కొత్తరకం వైరస్ సెప్టెంబరు నాటికి బయటపడితేనే ఈ పరిస్థితి వస్తుందన్నారు. రెండో దశ కేసులతో(Corona 2nd wave) పోల్చితే మూడో దశ తీవ్రత(Corona 3rd wave) తక్కువగానే ఉంటుందని లెక్కగట్టారు. మూడోదశ తీవ్రత ఎలా ఉండబోతుందన్న అంశంపై మనీంద్ర నేతృత్వంలోని ముగ్గురు శాస్త్రవేత్తల బృందం గణిత నమూనా ఆధారంగా వివిధ అంచనాలు రూపొందించింది.
''ప్రస్తుత వైరస్ రకాలే కొనసాగితే పరిస్థితిలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. ఒకవేళ వీటికి భిన్నమైన, ప్రమాదకర కరోనా వైరస్(Coronavirus) పుట్టుకొస్తే మాత్రం.. గరిష్ఠంగా రోజూ లక్ష వరకు కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం డెల్టా(Delta variant) కంటే ప్రమాదకరమైన వైరస్ రకాలు మన దేశంలో లేవు. ఒకవేళ సెప్టెంబరు నాటికి అలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం.. మూడోదశ కేసులు అక్టోబరు-నవంబరు మధ్య తీవ్రస్థాయిలో ఉంటాయి.''
- మనీంద్ర అగర్వాల్, ఐఐటీ- కాన్పుర్ శాస్త్రవేత్త
ప్రస్తుత డేటా ప్రకారం వైరస్ పునరుత్పత్తి రేటు (ఆర్ వాల్యూ) 0.89 శాతంగానే ఉంది. ఈ విలువ 1 కంటే తక్కువ ఉన్నంతవరకూ వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు భావిస్తారు.
ఇదీ చూడండి: పోల్‌ను ఢీకొట్టిన ఆడి కారు.. ఎమ్మెల్యే కుమారుడు, కోడలు మృతి