వర్షాల కారణంగా నది పొంగిపొర్లడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ జిల్లా వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఘఘరా నదికి వచ్చిన వరదతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వరద సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ శామ్యూల్ పాల్ సందర్శించారు. సహాయక శిబిరాల ఏర్పాటు గురించి స్థానికులకు వెల్లడించారు. అక్కడ అన్ని సౌకర్యాలున్నాయని చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలు సహాయక శిబిరాలకు రావాలని కోరారు. 'మీరు ఇక్కడ ఉండేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశాం. క్లోరిన్ మాత్రలు ఇస్తాం. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే.. వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇది సహాయక శిబిరాల ఉద్దేశం. మీరు ఇంట్లో ఉంటే మేం ఆహారం పంపాలా..? ఇక్కడ ప్రభుత్వమేమీ జొమాటో సేవలు నడపడం లేదు' అని కలెక్టర్ మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ మాటలను నెటిజన్లు తప్పు పడుతున్నారు. కాస్త సున్నితంగా ఉండాలని సూచిస్తున్నారు. సోమవారం నుంచి కురుస్తోన్న వర్షాలతో యూపీలోని 18 జిల్లాలపై ప్రభావం పడింది.
ఇవీ చదవండి: ఏడాది తర్వాత ఏకమైన తల్లీబిడ్డలు.. ఇది ఓ చిన్నారి చిరుత కథ!