Congress leader Ripun Bora resign: కాంగ్రెస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, అసోం పీసీసీ మాజీ అధ్యక్షుడు రిపున్ బోరా ప్రకటించారు. అసోంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు భాజపాతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. భాజపాకు వ్యతిరేకంగా పోరాడాల్సిన వారే ఇలా చేయడం బాధ కలిగించిందని లేఖలో పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ తరఫున సేవ చేసేందుకు అవకాశమిచ్చినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు బోరా.
"భాజపాతో పోరాడటానికి బదులుగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకరితో ఒకరు కొట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. భాజపా మతతత్వ, విభజన శక్తులకు చిహ్నం. భాజపా వల్ల ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు. కొందరు కాంగ్రెస్ నేతలు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. భాజపాతో కాంగ్రెస్ కొట్లాడే స్థితిలో ప్రస్తుతం లేదు. అందుకే పార్టీని వీడుతున్నా."
-రిపున్ బోరా, కాంగ్రెస్ మాజీ నేత
బోరా 1976 నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారు. అసోం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగాను సేవలందించారు. 2016 నుంచి 2021వరకు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. రిపున్ బోరా తన రాజీనామాను ప్రకటించిన కొద్దిసేపటికే.. కోల్‌కతాలో ఆదివారం తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. బోరాకు స్వాగతం పలుకుతూ టీఎంసీ ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి: 'భారత్లో 40లక్షల కరోనా మరణాలు- కేంద్రమే కారణం!'