ETV Bharat / bharat

అసలేంటీ కొలీజియం? కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ ఎందుకు..? - భారత న్యాయమూర్తుల ఎన్నిక

న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ అన్నది రాజ్యాంగానికి అతీతంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజు అన్నారు. కొలీజియం వ్యవస్థే కారణంగానే దేశంలో కేసులు కొండల్లా పేరుకు పోయాయని ఆరోపించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ నెలకొంది. అసలు కొలీజియం అంటే ఏంటీ? ఎలా వచ్చిందంటే?.

collegium system in india
కొలీజియం వ్యవస్థ
author img

By

Published : Dec 18, 2022, 7:15 AM IST

ప్రస్తుతం దేశంలో న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్లు వ్యాఖ్యానించి తేనెతుట్టెను కదిపారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు. 2014లో తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)ని కొట్టేయటం ద్వారా ప్రజలెన్నుకున్న పార్లమెంటు సార్వభౌమతాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ విమర్శించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అంతేఘాటుగా స్పందించి.. ప్రభుత్వం మాటలు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. తాజాగా రెండ్రోజుల కిందట.. న్యాయస్థానాల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమన్నట్లుగా కిరణ్‌ రిజిజు మళ్లీ ప్రకటించటం గమనార్హం!. మొత్తానికి న్యాయమూర్తుల నియామక వ్యవహారంపై నరేంద్రమోదీ ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి ఇవన్నీ అద్దంపడుతున్నాయి.

రాజ్యాంగం ఏం చెప్పింది?
స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124, 217లు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక అధికారాలను రాష్ట్రపతికి దఖలు పరిచాయి. సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సంప్రదించి రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకాలు చేస్తారని రాజ్యాంగం పేర్కొంది. ఈ 'సంప్రదింపుల' పదాన్ని నిర్వచించటంలోనే చిక్కుముడులు పడ్డాయి.

తొలుత ఎలా?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి నుంచి న్యాయమూర్తుల నియామకాలు ప్రభుత్వ ఇష్టాయిష్టాల మేరకే జరిగినా సంప్రదాయాలను పాటించారు. ముఖ్యంగా 1950-73 దాకా సీనియర్‌ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 1973లో ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి గండికొట్టి ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులను కాదని జస్టిస్‌ ఎ.ఎన్‌.రేకు ప్రధాన న్యాయమూర్తి పదవిని కట్టబెట్టింది. 1977లో మళ్లీ ఇందిర హయాంలోనే సీనియర్లను పక్కనబెట్టి జస్టిస్‌ మిర్జా హమీదుల్లా బేగ్‌ను నియమించారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ 1993లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుతో ప్రభుత్వ విశేషాధికారాలకు కత్తెరపడింది. కొలీజియం వ్యవస్థకు నాందిపడింది.

మరి సమస్యేంటి?
ఈ కొలీజియం వ్యవస్థ అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఏర్పడింది. ప్రభుత్వానిది ఇందులో పరిమితమైన పాత్ర! ఏ పేరుపైనైనా ప్రభుత్వం అభ్యంతరం తెలుపవచ్చు. కానీ కొలీజియం మళ్లీ అదే పేరును సిఫార్సు చేస్తే నియమించటం తప్ప ప్రభుత్వం చేసేదేమీ లేదు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవటమేంటనేది విమర్శ! అంతేగాకుండా కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని... ఎలాంటి రికార్డు ఉండదనీ.. అంతా రహస్యంగా జరిగే నిర్ణయాలనేది ప్రధాన విమర్శ.

అందుకే.. వచ్చింది ఎన్‌జేఏసీ
కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టులో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)ని ఏర్పాటు చేసింది. ఈ బిల్లుకు ఆనాడు అన్ని పార్టీలూ మద్దతివ్వటం గమనార్హం. నియామకాలతో పాటు న్యాయమూర్తుల బదిలీలను కూడా ఈ కమిషన్‌ చూసుకుంటుంది. ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టు నుంచే సీనియర్‌ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. వీరికి తోడు కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు నిపుణులను ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈ ఇద్దరు నిపుణులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్ష నేతలతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. అయితే.. 2015 అక్టోబరులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 4:1 మెజార్టీతో ఎన్‌జేఏసీని కొట్టేసింది.

విపక్షాల మద్దతు నో..
కొలీజియం వ్యవస్థను మార్చాలంటే రాజ్యాంగ సవరణ బిల్లు అవసరం. దీనికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది ఎంపీలు మద్దతివ్వాలి. అంతేగాకుండా సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మద్దతునివ్వటానికి నిరాకరిస్తున్నాయి.

ఎలా వచ్చిందీ కొలీజియం?
సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పుల ఆధారంగా ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకాలకు అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ రూపుదిద్దుకుంది. వీటిని ఫస్ట్‌ జడ్జి కేసు, సెకండ్‌ జడ్జి కేసు, థర్డ్‌ జడ్జి కేసుగా పిలుస్తారు.

ఫస్ట్‌ జడ్జెస్‌ కేసు (1982)
న్యాయమూర్తుల నియామకాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని రాజ్యాంగంలో ఉన్నా.. రాష్ట్రపతిదే అంతిమ నిర్ణయమని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 4:3 నిష్పత్తిలో మెజార్టీ తీర్పునిచ్చింది. సీజేఐ సలహాను తప్పనిసరిగా రాష్ట్రపతి పాటించాల్సిన అవసరం ఏమీ లేదని తేల్చారు.

సెకండ్‌ జడ్జెస్‌కేసు (1993)
ఈ కేసులో తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం రాజ్యాంగంలోని ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్రపతి సంప్రదింపులకు కొత్త భాష్యానిచ్చింది. సంప్రదింపుల్లో సీజేఐ అభిప్రాయమే కీలకమని, పాలన వ్యవస్థకు ఇందులో సమ ప్రాధాన్యమిస్తే న్యాయవ్యవస్థలో క్రమశిక్షణ లోపించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. కాబట్టి నియామకాల్లో ప్రధాన న్యాయమూర్తి మాట కీలకమని తేల్చిచెప్పింది. జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ మెజార్టీ తీర్పును వెలువరించారు.

థర్డ్‌ జడ్జెస్‌ కేసు (1998)
అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ ఈ సంప్రదింపులపైనే సుప్రీంకోర్టును వివరణ కోరారు. ఆర్టికల్‌ 124, 217, 222ల ప్రకారం సంప్రదింపులంటే ప్రధాన న్యాయమూర్తి ఒక్కడి అభిప్రాయమా లేక ఇతర న్యాయమూర్తుల అభిప్రాయం కూడానా.. తేల్చండి అని రాష్ట్రపతి కోరారు. సంప్రదింపులంటే ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు కొందరి అభిప్రాయాలు తీసుకోవటమేనని, బహుళత్వానికి పెద్దపీట వేస్తూ సుప్రీంకోర్టు బదులిచ్చింది. అంతేగాకుండా.. ఉన్నత న్యాయస్థానాల్లో నియామకాలు, బదిలీలకు సంబంధించి 9 మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. జస్టిస్‌ ఎస్‌.పి.భరూచా నాయకత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం న్యాయమూర్తుల నియామకాల్లో పాలన వ్యవస్థపై న్యాయవ్యవస్థ పెత్తనాన్ని స్పష్టం చేసింది. అదే కొలీజియం వ్యవస్థ! అప్పటి నుంచి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కమిటీ కొత్త నియామకాలు, న్యాయమూర్తుల బదిలీలను ప్రభుత్వానికి ప్రతిపాదిస్తోంది. హైకోర్టుల్లో కూడా ఇలాంటి కొలీజియమే పనిచేస్తుంది. అక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలో ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు కమిటీగా ఏర్పడి సిఫార్సులు చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.