KODI KATTI CASE UPDATES: విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై కోడికత్తి దాడి చేసిన ఘటనపై నేడు ఎన్‌ఐఏ కోర్టు విచారణ జరిపింది. ఈరోజు సీఎం జగన్ ,ఆయన పీఏ నాగేశ్వరరెడ్డి సాక్షులుగా విచారణకు హాజరుకావాలని గత విచారణలో ఆదేశాలు జారీ చేసింది . విచారణ షెడ్యూల్ ను సైతం ఖరారు చేసింది . ఈ రోజు సీఎం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అయ్యేందుకు మినహాయింపు కావాలని సీఎం తరపు న్యాయవాది కోర్టును కోరారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించటంతో పాటు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాల సమీక్షలు ఉంటున్నాయని కోర్టుకు తెలిపారు . సీఎం కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ కు ఇబ్బంది వస్తాయన్నారు .అడ్వకేట్ కమిషనర్ ను నియమించి అతని సమక్షంలో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కానీ ఇతర ఎలక్ర్టానిక్ మార్గాల ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని న్యాయమూర్తిని కోరారు. పిటీషన్ల పై విచారణ జరిపిన న్యాయమూర్తి షెడ్యూల్ ను రద్దు చేశారు . నిందితుడ్ని , ఎన్ ఐఏ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు . తదుపరి విచారణను ఈనెల 13 కి వాయిదా వేశారు. 13న పిటీషన్లపై విచారణ జరిపి వ్యక్తి గత హాజరుపై నిర్ణయం తెలుపుతామన్నారు .
కేసు విచారణను పొడిగించేందుకే రెండు పిటీషన్లను దాఖలు చేశారని నిందితుడి తరపు న్యాయవాది సలీం అన్నారు . బాధితునిగా ఉన్న సీఎం ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలని ఆయన అన్నారు . 2019 లోనే ఎన్ ఐఏ విచారణ జరిపి చార్జ్ షీట్ దాఖలు చేసిందన్నారు. నాలుగేళ్ల తర్వాత కేసులో తదుపరి దర్యాప్తు కోరటం సమంజసం కాదన్నారు. నిందితుడు శ్రీనివాసరావుపై స్వగ్రామంలో కేసు నమోదైనట్లు అతనికే తెలీదన్నారు. తోపులాట జరిగనట్లు నమోదైన కేసులో ఇన్నేళ్లైనా అభియోగపత్రం కూడా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఘటన వెనుక కుట్రకోణం ఉందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు .
నిందితుడు శ్రీనివాసరావుపై అతని స్వగ్రామంలో 2017 లో కేసు నమోదైందని .. ఆ విషయాన్ని దాచిపెట్టి ఎయిర్పోర్ట్ పీఎస్ లో ఎన్వోసి తీసుకున్నారని సీఎం తరపు న్యాయవాది వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీనివాసరావు పనిచేస్తున్న రెస్టారెంట్ యజమాని ఈ విషయాన్ని దాచిపెట్టారన్నారు . పోలీసులు సైతం సరైన విచారణ చేయకుండానే ఎన్వోసి ఇచ్చారని .. దీని ద్వారా నిందితుడు విమానాశ్రయం లోనికి ప్రవేశించేందుకు పాస్లు పొందారన్నారు. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ టీడీపీ సానుభూతిపరుడని తెలిపారు. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగిందన్నారు .
ఆపరేషన్ గరుడ పేరుతో ఓ సెలబ్రిటీ పై దాడి జరగబోతోందనే విషయాన్ని ఓ ప్రముఖ వ్యక్తి చెప్పారని .. ఆతర్వాతే ఈ ఘటన జరిగిందన్నారు. ఘటన జరిగిన ముందు రోజే నిందితుడు శ్రీనివాసరావు సీఎం జగన్ ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని న్యాయవాది వెంకటేశ్వర్లు అన్నారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని.. ఎన్‌ఐఏ సైతం ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపిందని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఘటనపై దర్యాప్తు కొనసాగాలని కోరినట్లు సీఎం తరపు న్యాయవాది తెలిపారు. మరో వైపు సీఎంకు ప్రజాపాలనా, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షలు ఉంటాయని.. అందుకే కోర్టు హాజరుకు మినహాయింపు కోరినట్లు తెలిపారు.ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం పిటీషన్లపై ఈనెల 13 న విచారించి.. సీఎం హాజరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది . ఈకేసు 3 వ సాక్షిగా ఉన్న సీఎం పీఏ నాగేశ్వరరెడ్డి కోర్టుకు హాజరయ్యారు ...
ఇవీ చదవండి: