Chandrababu Skill Development Case: స్కిల్ కేసును (Skill Development Case) కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై.. ఈ నెల 9, 10 తేదీల్లో విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కూడా దాన్ని కొనసాగించింది. మధ్యాహ్నం ప్రారంభమైన విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీయే పూర్తిగా వాదనలు వినిపించారు. ప్రస్తుత చట్టంలో నేరం కాని అంశంపై ఎఫ్‌ఐఆర్ నమోదు ఎలా చేస్తారంటూ గత విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ముకుల్ రోహత్గీ తన వాదనలను ప్రారంభించారు.
నేరం పాత చట్టం అమలులో ఉన్న సమయంలో జరిగి ఉంటే అప్పటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నేరం 2015-16లో జరిగింది కాబట్టి ఆ సమయంలో అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్లు అమల్లో ఉన్నాయని, అందుకే వాటిని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అప్పుడు జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ ఇటీవల రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్ 377ని రద్దు చేసిందని, దానికి సంవత్సరం ముందు నేరం జరిగిందన్న కారణంతో ఆ సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయొచ్చా? అని ప్రశ్నించారు.
అందుకు ముకుల్ రోహత్గీ బదులిస్తూ ఈ కేసు అందుకు భిన్నమైనదన్నారు. సెక్షన్ 17ఎ కింద మినహాయింపులు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయానికే వర్తిస్తాయని.. సెక్షన్ 19లో ఉన్నట్లుగా అన్ని విషయాలపైనా పూర్తి నిషేధం ఉండదనన్నారు. ఈ కేసులో పిటిషనర్ అధికార విధుల్లో భాగంగా నిర్ణయాలు తీసుకున్నారా లేదంటే ఇతరత్రా కారణాలున్నాయా? అనేదానిపై దర్యాప్తు జరుగుతోందని, అది మొదలై ఇప్పటికి నెల రోజులు మాత్రమే అయిందన్నారు.
మాకు అనుమానాలున్నాయి: జోక్యం చేసుకున్న జస్టిస్ అనిరుద్ధ బోస్... దీని అమలుపై మాకు అనుమానాలున్నాయి. ఇక్కడ 17ఎ కింద విచారణ ప్రారంభించడం పైనే అవరోధం ఉంది. అలాంటప్పుడు పోలీస్ అధికారి ఒక అభిప్రాయానికి వచ్చి విచారణ ప్రారంభించొచ్చా అని ప్రశ్నించారు. తర్వాత జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ ‘పరిపాలనాధికారుల వద్ద ఎలాంటి మెటీరియల్ లేకపోయినా, ఏ ప్రాతిపదికన అథారిటీ విచారణ చేపడుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ పాత చట్టం కింద నమోదు చేశారని మీరు చెబుతున్నందున 17ఎ వర్తిస్తుందా.. లేదా? అని అడగ్గా.. వర్తించదని రోహత్గీ బదులిచ్చారు. నేరం జరిగిన సమయంలో 17ఎ మనుగడలో లేనందున వర్తించదని వాదించారు. ఆ విషయాన్ని నాలుగు హైకోర్టులు సమర్థించాయని చెప్పారు.
ఈ అంశానికి సంబంధించి తన అమ్ములపొదిలో మూడు నాలుగు బాణాలున్నాయన్నారు. ఒకటి.. 17ఎకి రావడానికి ముందు జరిగిన నేరాలకు ఇది వర్తించదన్న ఆయన.. ఆ సెక్షన్ 2018 జులైలో వస్తే నేరాలు 2015-16లో జరిగాయన్నారు. దాని ప్రకారం అప్పట్లో ఉన్న చట్టం ప్రకారమే విచారించాల్సి ఉంటుందన్నారు. రెండోది.. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరోపణలు ఏవీ అధికార విధుల నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాల్లా ఏ మాత్రం కనిపించడంలేదని.. నిధుల దుర్వినియోగం కేసుల్లో 17ఎ కానీ, సెక్షన్ 19 కానీ, 197 కానీ వర్తించవని చెప్పారు. ఒకవేళ దీనిపై వివాదం ఉంటే దర్యాప్తులో వాస్తవాలు బయటపడిన తర్వాత ట్రయల్ జడ్జి మాత్రమే నిర్ణయం తీసుకోగలరని అన్నారు.
ఆధారాలు సేకరించిన తర్వాతే తుది నిర్ణయం: నిజాయితీపరులైన అధికారులు నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జంకకూడదన్న ఉద్దేశంతో 17ఎని చేర్చారని రోహత్గీ చెప్పారు. దీనికి జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ ఆ చట్ట సవరణకు సంబంధించిన ఉద్దేశాలు, లక్ష్యాలను మీరెప్పుడైనా చూశారా? అది 17ఎ గురించి చెప్పలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కేసులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అధికార విధుల్లోకి వస్తాయా..? రావా..? అన్నది ఈ స్థాయిలో నిర్ణయించడం సాధ్యం కాదని, ఆధారాలు సేకరించిన తర్వాతే దానిపై తుది నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని.. కాబట్టి దానిని ట్రయల్ కోర్టుకే వదిలిపెట్టాలని ముకుల్ రోహత్గీ కోరారు.
2018లో మొదలైన విచారణ ప్రారంభమైన వెంటనే ముగియలేదని, అది కొనసాగిందని చెప్పారు. 2014 మే 14న ఒక ప్రజా వేగు రాసిన లేఖలో డిజైన్‌టెక్, సీమెన్స్ కంపెనీలు డబ్బును దారి మళ్లిస్తున్నట్లు ఫిర్యాదు చేశారన్నారు. జీఎస్‌టీ డైరెక్టర్ జనరల్ ఇందులో సేవా పన్ను విషయాలపై విచారణ చేశారని, మీరు అవినీతి విషయంలో విచారణ జరపాలని సీబీఐ, ఏసీబీని కోరినట్లు రోహత్గీ వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలూ విచారణ జరుపుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని చెప్పడానికి వీల్లేదన్నారు. ఈ కేసులో డీజీఎస్‌టీ, సెబీలు, ఐటీ విచారణ జరుపుతున్నాయన్నారు. నిందితులు 370 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని, అక్కడి నుంచి నగదు రూపంలో దాన్ని ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. అందులో చాలావరకు పిటిషనర్‌కు వెళ్లాయని ఆరోపించారు. అప్పుడు జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ‘ నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నట్లు రోహత్గీ బదులిచ్చారు. అందుకే తాము హైకోర్టులో సవివర కౌంటర్ దాఖలు చేశామన్నారు. తమ ఆరోపణలు తప్పు కావొచ్చు, ఒప్పు కావచ్చన్న ఆయన.. అయితే దానిపై ముందుగా దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. దీనిపై పలు కేంద్ర సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు రాజకీయ కక్ష అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.
ఈ కేసును ధర్మాసనం తొలుత సోమవారానికి వాయిదా వేయాలనుకున్నా ఆ రోజు తనకు వీలుకాదు అని ముకుల్ రోహత్గీ చెప్పడంతో.. మంగళవారానికి వాయిదావేసింది. ఆ రోజు వాదనలకు మరో అరగంట సమయం కావాలని ముకుల్ రోహత్గీ కోరారు. ఆ తర్వాత తాము వివరణ ఇస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే చెప్పడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.