Chandrababu Quash Petition Hearing in Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్పై దీపావళి తర్వాత తీర్పు వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తి కావడంతో గత నెలలోనే దీనిపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఈ తీర్పు చాలా కీలకంగా మారబోతోంది. సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ను ఆమోదిస్తే ఈ కేసుతో పాటు మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు ఊరట లభిస్తుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 10న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ సీఐడీ.. చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటమే కాకుండా అర్ధరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్టు చేసింది. తర్వాత ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ 52 రోజుల రిమాండ్ అనంతరం చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు.. నాలుగు వారాలపాటు మంధ్యతర బెయిల్ మంజూరు చేయటంతో విడుదలయ్యారు.
'ఉచిత ఇసుక' కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ - విచారణ ఈనెల 22కు వాయిదా
ఫైబర్ నెట్ కేసు..
ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. ఈనెల 30కి విచారణ వాయిదా వేస్తూ.. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. 17ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని పేర్కొంది. కేసు విచారణ తొలుత ఈ నెల 23కి వాయిదా వేయాలని నిర్ణయించిన ధర్మాసనం.. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు 30కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసినందున సగం విచారించిన జాబితా కిందకు తీసుకుంటున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
'ఉచితంగా ఇసుక ఇచ్చారని చంద్రబాబుపై కేసు - ఉచితంగా బియ్యం ఇచ్చినందుకు మోదీపైనా కేసు పెడతారా?'
Chandrababu Fibernet Case: 17ఏ కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం, ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచడం చేయొద్దని ధర్మాసనం మౌఖికంగా ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అంగీకరించింది. విచారణను మరోసారి వాయిదా వేయటంతో.. ఈ కేసు ముగిసేవరకు అరెస్టు చేయబోమన్న నిబంధన కొనసాగించాలని సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. గత హామీ మేరకే కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తెలిపారు.
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొంటూ చంద్రబాబుపై అభియోగం మోపింది. టెండర్లు లేకుండానే టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారంటూ.. 2021లో ఫైబర్ నెట్ కేసు నమోదు చేసిన సీఐడీ.. 19మందిపై అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ను ఏసీబీ, హైకోర్టులో కొట్టివేయగా.. సుప్రీంను ఆశ్రయించారు.
చంద్రబాబు మధ్యంతర బెయిల్ - అదనపు షరతుల అంశంపై హైకోర్టు తీర్పు