Chandrababu met CEC Officials with Pawan Kalyan : 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నానన్న చంద్రబాబు, ప్రస్తుత భయంకర పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతిపక్షాలు వినతిపత్రాలు ఇవ్వాల్సి వస్తోందన్న ఆయన అధికారులు నిబంధనల ప్రకారం పని చేస్తే పార్టీలు రాజకీయ ఎజెండాపై దృష్టి పెడతాయన్నారు. కానీ రాష్ట్రంలోని పార్టీలకు తమ ఓట్లను కాపాడుకోవడానికే సమయం సరిపోవడం లేదన్నారు. చివరకు ఎమ్మెల్యే ఎన్నికలనూ ఏకగ్రీవంగా చేసుకునేంత భయంకర పరిస్థితులున్నాయన్నారు. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలపై 6వేల కేసులు పెట్టారన్న చంద్రబాబు, ఎన్నికల నాటికి 60 నుంచి 70వేల మందిని జైల్లో వేయడానికి దుర్మార్గపు ప్రణాళికలు అమలు చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఆందోళన వెలిబుచ్చారు.
'ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం - ఒక్క దొంగ ఓటు ఉన్నా వదిలేది లేదు'
2024 Election Process in AP : ఎన్నికల విధులు ఎవరు నిర్వహించాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తోందని చంద్రబాబు కేంద్ర ఎన్నిల సంఘానికి వివరించారు. ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరం చేశారన్న ఆయన సచివాలయ సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. మళ్లీ జగనే కావాలని వారితోనే ప్రచారం చేయిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను వారితో పంపిణీ చేయిస్తూ వైఎస్సార్సీపీకి ఓటేయకపోతే పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారన్నారు.
బీఎల్‌ఓ బాధ్యతలనూ వారికే అప్పగించారన్నారు. ఎన్నికల విధులు వీరికి అప్పగిస్తే నిష్పక్షపాతంగా జరుగుతాయా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు బాగానే ఉన్నా కిందిస్థాయిలో అవి అమలు కావట్లేదన్నారు. సమస్య అంతా అక్కడే ఉందన్న ఆయన విపక్షాల మద్దతుదారుల ఓట్లను తొలగిస్తూ వైఎస్సార్సీపీకి చెందిన దొంగ ఓట్లను చేరుస్తున్నారని వివరించారు. నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేసి సరిపెట్టడం సరికాదని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫారం-8 మాటేంటీ సార్ - పొరుగు రాష్ట్రానికి వెళ్తే ఓటు గల్లంతేనా?
రాష్ట్రంలో బెదిరించి భయాందోళనకు గురిచేయడం నిరంతర ప్రక్రియగా తయారైందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివరించారు. సాధారణ గృహిణి పైనా హత్యాయత్నం కేసులు పెడుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలకు చెందినవారిని నామినేషన్ కూడా వేయనీయలేదని చెప్పారు. తాను విశాఖపట్నం పర్యటనకు వెళ్లినప్పుడు భయానక వాతావరణం సృష్టించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో పరిస్థితుల్ని గమనిస్తున్నామని, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగ పక్షపాతధోరణిని గమనిస్తున్నామని వెల్లడించారు.