Chandrababu Allegations on YSRCP: మూడు నెలల్లో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వస్తుందని, ఆ సునామీలో వైఎస్సార్సీపీ చిరునామా గల్లంతవుతుందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తునిలో 'రా కదలిరా' బహిరంగ సభలో వైఎస్సార్సీపీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జీవితంలో ఎప్పుడూ జగన్ గెలిచే అవకాశాలు లేవని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాజకీయం మారిందనేందుకు తునియే సాక్ష్యమని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే, త్వరలో సునామీగా మారుతుందని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు తెలుగుదేశం-జనసేన మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు.
భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత: 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ' తప్పకుండా అమలు చేస్తామని నారా చంద్రబాబు పేర్కొన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం అన్న ఆయన, తెలుగుజాతి స్వర్ణయుగం కోసం కదలిరావాలని పిలుపునిచ్చారు. తాను తెలుగుజాతిని స్వర్ణయుగం వైపు నడిపే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనే ఎన్టీఆర్ కల అని, ఆ కలను సాకారం చేస్తానని చంద్రబాబు తెలిపారు. పేదరికం నుంచి ప్రతి ఒక్కరూ బయటపడేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్‌గా ఉండాలనేది తన సంకల్పమని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
'ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బదిలీ - టీడీపీ విజయానికిదే నిదర్శనం'
వెనుకబడిన వర్గాల కోసం జయహో బీసీ: వైఎస్సార్సీపీ చేస్తున్న అరాచకాలపై ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ రాతియుగం పోయి టీడీపీ-జనసేన స్వర్ణయుగం వస్తుందని భరోసా ఇచ్చారు. వెనుకబడిన వర్గాల కోసం జయహో బీసీ తీసుకువచ్చామన్న చంద్రబాబు, అన్ని వర్గాలను గౌరవించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. టీడీపీ వెనుకబడిన వర్గాలకు సమర్థ నాయకత్వం ఇచ్చిందని తెలిపారు.
ఎన్నికల తంతు అంతా సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చెప్పినట్టే : చంద్రబాబు
ఆడబిడ్డల తాళిబొట్లతో ఆడుకునే పరిస్థితి: ఇది సైకో జగన్‌కు, ఐదు కోట్ల ప్రజలకు మధ్య పోరాటమని వెల్లడించారు. ఐదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. కల్తీ మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లతో ఆడుకునే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిందని వెల్లడించిన బాబు, త్వరలోనే పేదలు, రైతుల సంక్షేమ రాజ్యం వస్తుందని తెలిపారు. కౌలురైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. జగన్ అహంకారమే అతని అంతానికి దారితీసే పరిస్థితిలా మారిందని పేర్కొన్నారు.
'తెలుగుదేశం వెనుకబడిన వర్గాలకు సమర్థ నాయకత్వాన్ని ఇచ్చింది. వెనుకబడిన వర్గాల కోసం జయహో బీసీ తీసుకువచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాలను గౌరవించే బాధ్యత తీసుకుంటాం. 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ' తప్పకుండా అమలు చేస్తాం.'- తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు