దిల్లీని విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక డెంగీ మరణాలు ఈ సీజన్లో నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క వారంలోనే 531 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 1,530కి చేరింది. ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పరీక్షలను వేగవంతం చేసేందుకు.. డెంగీ ఎన్ఎస్-1 ఎలీసా టెస్టింగ్ కిట్లను సమకూర్చుకోవాలని దిల్లీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.
2015లో దిల్లీలో డెంగీ విపరీతంగా వ్యాపించింది. కేవలం అక్టోబరులోనే 10,600కు పైగా కేసులు వెలుగుచూశాయి.
దిల్లీలో విస్తుపోయే 'డెంగీ' గణాంకాలు..
- 2018 తర్వాత దిల్లీలో అత్యధిక డెంగీ మరణాలు ఈ ఏడాదే నమోదయ్యాయి. 2016లో 10మంది మృతిచెందారు.
- జనవరి 1-అక్టోబర్ 30 మధ్యకాలంలో.. 2020లో 612.., 2019లో 1,069.., 2018లో 1,595 కేసులు నమోదుకాగా.. ఈ ఏడాది 1,530 వెలుగుచూశాయి.
- ఈ ఏడాది.. జనవరి-ఆగస్టు మధ్య 124 కేసులు బయటపడగా.. ఆగస్టు తర్వాత తీవ్రత పెరిగింది.
- ఇవేగాక.. 160 మలేరియా కేసులు, 81 చికెన్‌గన్యా కేసులు కూడా నమోదయ్యాయి.
కేంద్రం అప్రమత్తం..
దిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగా డెంగీ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
"దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో డెంగీ కేసులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. దిల్లీ ప్రభుత్వంతో కలసి నిపుణుల బృందం ఓ ప్రణాళికను రూపొందిస్తుంది. డెంగీ వ్యాప్తి అధికంగా ఉన్న 200 జిల్లాలను గుర్తించి బృందాలను పంపుతాం. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు.. వేగంగా డెంగీ నిర్ధరణ పరీక్షలు జరుపుతాం" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కేసుల పెరుగుదల నేపథ్యంలో దేశ రాజధానిలోని ప్రైవేట్ ఆసుపత్రులు డెంగీ రోగుల కోసం పడకల సంఖ్యను పెంచుతున్నాయి. వాయిదా వేయదగిన శస్త్రచికిత్సలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి.
ఇవీ చదవండి: