Sonali Phogat Death : భాజపా నాయకురాలు, నటి సోనాలి ఫోగాట్ (42) మృతిపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సిఫార్సు మేరకు కేంద్ర హోంశాఖ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫోగాట్ కుటుంబ సభ్యులు స్వాగతించారు.
గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్ ఆగస్టు నెలలో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు.. ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఫోగాట్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. పనాజీ పోలీసులు విస్తృత దర్యాప్తు చేసినప్పటికీ హరియాణా ప్రజలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేస్తున్నామన్నారు. గోవా సీఎం సిఫార్సు చేసిన కొన్ని గంటల్లోనే ఈ కేసును సీబీఐకి అప్పజెప్పుతున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.
ఇవీ చదవండి: కేజ్రీవాల్‌ను ఇంటికి ఆహ్వానించిన ఆటోడ్రైవర్.. దిల్లీ సీఎం ఏమన్నారంటే..
CCTV Video.. బాలుడిపై విరుచుకుపడ్డ వీధి కుక్క.. కాళ్లు, చేతులు కొరికి...