Summons to YS Avinash Reddy in YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టులో విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. వైఎస్ అవినాష్ రెడ్డి ఎనిమిదో నిందితుడిగా పేర్కొంటూ గత నెల 30న సీబీఐ సమర్పించిన అనుబంధ అభియోగపత్రాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఏడో నిందితుడిగా వైఎస్ భాస్కర్‌రెడ్డి, అరో నిందితుడిగా ఉదయ్ కుమార్ రెడ్డిపై అభియోగాలనూ విచారణకు స్వీకరించింది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఛార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలను కూడా ఛార్జిషీట్‌తో పాటు న్యాయస్థానం జతపరిచింది. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ శంకర్ రెడ్డి చంచల్‌గూడ జైళ్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ శంకర్ రెడ్డి రిమాండ్‌ను ఆగస్టు 14 వరకు న్యాయస్థానం పొడిగించింది.
పులివెందులలో 2019 మార్చి 15న హత్య జరిగిన వైఎస్ వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా అనేక మలుపులు తిరిగింది. మొదట రాష్ట్ర పోలీసుల సిట్ దర్యాప్తు ప్రారంభించింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 209 జూన్ 13న కొత్త సిట్ ఏర్పాటయింది. చివరకు హైకోర్టు ఆదేశాలతో 2020లో కేసు సీబీఐకి చేరింది. దర్యాప్తు చేసిన సీబీఐ 2021 అక్టోబరు 26న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిపై ఛార్జి షీట్ వేసింది. మరో నిందితుడు డి. శివశంకర్ రెడ్డిపై 2022 ఫిబ్రవరి 3న అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ 6గా.. వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఏడో నిందితుడిగా చేర్చింది. ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని, 16న వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ కడప కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సి అవసరం ఉందని పలు సందర్భాల్లో న్యాయస్థానాల్లో సీబీఐ గట్టిగా వాదించింది. ఒక దశలో అవినాష్ రెడ్డిని నేరుగా అరెస్టు చేసేందుకు కర్నూలుకు కూడా దర్యాప్తు అధికారులు వెళ్లారు. అయితే మే 31న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజురు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులు, 5 లక్షల రూపాయల పూచీకత్తుతో సీబీఐ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది. వివేకా హత్య కేసుపై విచారణ ఏప్రిల్ 30నాటికే పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించడంతో వేగంగా దర్యాప్తు చేసి చివరి రోజున అనుబంధ ఛార్జిషీట్ వేసింది.