Margaret Alva news: ప్రతిపక్ష పార్టీల్లో ఐక్యత కొరవడటంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే అవకాశం దాదాపుగా లేకపోయినా.. తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా స్పష్టం చేశారు. సంఖ్యాబలానికి సంబంధించిన అంకెలు ఎప్పుడైనా అటూ ఇటూ కావొచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆళ్వా తాజాగా జాతీయ మీడియాతో ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలన్న నిర్ణయంపై పునరాలోచించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీకి ఇంకా సమయం ఉందని చెప్పారు. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ.. 'కావల్సినది తినలేం, చెప్పాలనుకున్నది చెప్పలేం, కలవాలనుకున్నవారిని కలవలేం. ఇదంతా ఏంటి?' అని ఆమె ప్రశ్నించారు. ముఖాముఖిలోని ప్రధానాంశాలివీ..
పార్లమెంటు ఉభయసభల్లో తరచూ ప్రతిష్టంభనలు చోటుచేసుకోవడంపై ఏమంటారు?
ఆళ్వా: అది చాలా దురదృష్టకరం. అధ్యక్ష స్థానాల్లో ఉన్నవారు ప్రతిపక్షాల డిమాండ్లేంటో తెలుసుకుని, దానిపై చర్చ సాగిస్తే సభ ఎజెండా సక్రమంగా నడుస్తుంది. చర్చలేవీ లేకుండా కేవలం 12 నిమిషాల్లో 22 బిల్లులను ఆమోదించడం సరికాదు. జీఎస్టీ గురించి చర్చించాలని మూడు రోజులుగా అడుగుతున్నారు. పాలు, పెరుగు మీద కూడా జీఎస్టీ వేస్తుంటే దానిపై చర్చించకపోవడం దారుణం.
ఇవి ఎగువ సభలోనే ఎక్కువగా ఎందుకు ఉంటున్నాయి?
ఆళ్వా: ఎగువ సభలో దిగ్గజాలు ఉంటారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడూ అక్కడ చర్చలు జరిగేవి, మాట్లాడే హక్కు ఉండేది. అందరూ వినేవారు. పార్లమెంటు ఉన్నదే చర్చల కోసం కదా.. మెజారిటీ ఉంటే ఓట్లు వేసుకోమనండి. కానీ, సభలో మైనారిటీ అభిప్రాయం కూడా వినాలి గానీ, తోసిపారేయకూడదు.
మీ ప్రత్యర్థి గవర్నర్‌గా చేశారు కదా.. మీ అభిప్రాయమేంటి?
ఆళ్వా: గవర్నర్ నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రభుత్వాన్ని పనిచేయనివ్వాలి. రాజ్‌భవన్‌లోకి ప్రవేశించగానే ఒక లక్ష్మణ రేఖ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అక్కడ కూర్చుని పార్టీ ప్రతినిధిలా పనిచేయకూడదు. అది అనైతికం, రాజ్యాంగవిరుద్ధం.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవం అయితే జాతీయ ఐక్యత ఉంటుందనుకోవడం లేదా?
ఆళ్వా: అవును.. అందుకే అధికారపక్షం నాకు మద్దతివ్వాలి. అన్ని పార్టీలతో ముందే చర్చించి ఏకాభిప్రాయానికి వస్తే బాగానే ఉంటుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ధన ప్రభావం ఉందని ప్రతిపక్షాల తరఫున పోటీ చేసిన యశ్వంత్ సిన్హా ఇటీవల ఆరోపించారు. మీరేమంటారు?
ఆళ్వా: ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి లెక్కలేదు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఎక్కడ చూసినా అంగబలం, అర్థబలంతో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు.
ఇవీ చదవండి: ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం.. ఆదివాసీ సంప్రదాయాలతో వైభవంగా..
'పర్యావరణాన్ని కాపాడుకుందాం.. సామాన్యులే నిజమైన దేశ నిర్మాతలు'