Delhi CM House Renovation : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ ఇచ్చింది కేంద్రం. సీఎం అధికారిక నివాసం పుననిర్మాణంలో నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై చర్యలకు సిద్ధమైంది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దీనిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుందని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.
అంతకుముందు దిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం పుననిర్మాణంలో అవకతవకలు జరిగాయని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. ఈ మేరకు కాగ్‌తో ఆడిట్ చేయించాలని మే 24న కేంద్ర హోం శాఖకు ప్రతిపాదిస్తూ లేఖ రాశారు. దీనిపై చర్యలు తీసుకున్న హోం శాఖ.. స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు సూచించింది.
ఈ వ్యవహారంపై దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. కేంద్రం నిర్ణయాన్ని ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని.. ఆ పార్టీలోని నైరాశ్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించింది. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునర్నిర్మాణంపై గతేడాదే కాగ్ పరిశీలన జరిపిందని, అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆప్ ఓ ప్రకటనలో పేర్కొంది.
సివిల్ లైన్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం- షీశ్ మహాల్‌ను పుననిర్మించింది దిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రజాపనుల శాఖ. ఈ నిర్మాణానికి మొదట రూ. 15-20 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు ఈ నివాసంపై రూ. 53 కోట్లు ఖర్చు చేశారు. నిబంధనలు అతిక్రమించి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేశారని లెఫ్టినెంట్ గవర్నర్.. కేంద్రం హోం శాఖకు లేఖ రాశారు.
దిల్లీ లా అండ్ ఆర్డర్‌పై కేజ్రీవాల్ ఫైర్
మరోవైపు దిల్లీలో నెలకొన్న శాంతిభద్రతలపై కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్‌పై మంగళవారం విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇటీవల ప్రగతి మైదాన్ దోపిడీని ఉద్దేశిస్తూ.. రాష్ట్రంలో ఆటవిక పాలన(జంగిల్ రాజ్) నడుస్తోందని ఆరోపించారు. శాంతి భద్రతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే.. దిల్లీని దేశంలోనే సురక్షిత నగరంగా మారుస్తామని చెప్పారు. దేశ రాజధాని నగరంలో శాంతి భద్రతల పరిస్థితి ఇలా ఉంటుందా అని ప్రశ్నించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రం.. సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పాఠశాలు, మొహల్లా క్లినిక్‌లను ఎలా నిలిపివేయాలో అని కేంద్రం ఆలోచిస్తోందని.. ఇవి కాకుండా శాంతి భద్రతలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
దిల్లీలో పట్టపగలే దోపిడీ
Delhi Robbery : దిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ వద్ద కారులో వెళ్తున్న బంగారు ఆభరణాల వ్యాపారి, అతడి సహచరుడి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదును దోచుకెళ్లారు దొంగలు. రెండు బైకులతో వెంబడించి.. రోడ్డుపై వెళ్తున్న కారును అడ్డగించి తుపాకులు చూపించి నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఈ నెల 24వ తేదీన జరగగా.. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి : 'ఇప్పుడు దిల్లీలో.. రేపు దేశమంతటా ఆర్డినెన్స్'.. కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్
'దిల్లీ అధికారాలు ప్రభుత్వానికే' తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్.. కోర్టు ధిక్కారమేనన్న కేజ్రీవాల్