ఉత్తర్‌ప్రదేశ్ ఎటా జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుక విషాదాన్ని మిగిల్చింది. వాయిద్య బృందం, వధూవరుల కుటుంబాల మధ్య జరిగిన వివాదం కాల్పులకు దారితీసింది. కన్యాదానం సమయంలో వాయిద్యకారులపై రంగులు పడడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో రెండు వర్గాల వారు పరస్పరం తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో వధువు సోదరి మరణించగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితలు తలెత్తకుండా బలగాలను మోహరించారు.
ఇదీ జరిగింది: ఫరద్పుర గ్రామానికి చెందిన రాధేశ్యామ్ తన కూతురు లలితకు .. మెహ్రుపుర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈ క్రమంలోనే వరుడు రాజ్‌కుమార్ శుక్రవారం రాత్రి ఊరేగింపుతో వధువు గ్రామానికి చేరుకున్నాడు. శనివారం ఉదయం కన్యాదానం జరుగుతున్న సమయంలో వధూవరుల కుటుంబాలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఈ క్రమంలోనే వాయిద్య బృందంపై రంగులు పడగా.. ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవ తీవ్రమై.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో బుల్లెట్ తగిలి వధువు సోదరి సుధ మృతిచెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఎస్పీ ఉదయ్ శంకర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చిరుతనే పరుగులు పెట్టించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్!