ప్రేమించిన వాడే ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. తనతో పాటు వచ్చిన ఆ యువతిపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆ ఘటనను చిత్రీకరించిన ప్రబుద్ధులు దాన్ని సామాజిక మాధ్యామల్లో పోస్ట్ చేస్తామని యువతిని బెదిరించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగింది.
తుండ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి, ఉత్తర కోత్వాలీలో నివాసం ఉంటున్న రవి అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడాలనుకున్న యువకుడు ఓ స్కెచ్ వేశాడు. దాని ప్రకారం ఆమెను ఊరి బయటకు రమ్మని పిలిచాడు. అతడి మాటలు విన్న ఆ యువతిని.. రవి స్నేహితులు కొంత మంది వచ్చి అతడి వద్దకు తీసుకెళ్తామని నమ్మబలికారు.
రవి, మరో ముగ్గురు కలిసి ఆమెను ఆగ్రాలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన యువతిని వీడియోలు చూపించి బెదిరించేందుకు ప్రయత్నించగా ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేశారు.
ఆర్మీ అధికారి కుమార్తెపై లైంగిక వేధింపులు..
దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లోని ఓ సీనియర్ మహిళా అధికారి కుమార్తెను ఓ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. యువతిని ఓ ప్రదేశంలో వదిలేసిన దుండగులు.. తన వద్దనున్న 500 రూపాయలతో పాటు ఓ క్రెడిట్ కార్డును లాక్కుని అక్కడ నుంచి పరారయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో నవంబర్ 8న జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. లఖ్‌నవూలోని ఎస్జీపీజీఐ పరిధిలోని ఓ దుకాణానికి వస్తువులు కొనేందుకు ఆ యువతి వెళ్లింది. అయితే అమ్మాయి ఎంతకీ రాకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ఆమెను వెతుక్కంటూ తల్లి షాప్ వద్దకు వెళ్లగా యువతి అక్కడికి వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది.
అలా అమ్మాయి ఆచూకీ కనుగునేందుకు తెలిబాఘ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తల్లికి.. గోమతి నగర్‌లోని ఫన్ రిపబ్లిక్ పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద యువతి కనిపించిందని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న తల్లికి దీన స్థితిలో ఆ యువతి కనిపించింది. తల్లిని చూసిన ఆ యువతి బోరున విలపించింది. ఈ విషయంపై యువతి తల్లి ఫిర్యాదును నమోదు చేసుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా కారు నంబర్‌ను ట్రేస్ చేసి నిందితుడి ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఉదయం నుంచే ఓ యువకుడు నా కదలికలను గమనిస్తున్నాడు. తెలిబాఘ్కు వెళ్తున్న సమయంలో నేను అతడ్ని ఆకాశ్ ఎన్క్లేవ్ వద్ద బైక్‌పై కూర్చుని ఉన్నప్పుడు గమనించాను. భయమేసి నేను షాపులో వస్తువులు కొనుక్కోకుండా ఆటో ఎక్కేశాను. ఆటో దిగి కొంత దూరం నడుస్తుండగా ఓ వ్యాన్ నా దగ్గరకు వచ్చింది. అందులో ఉన్న ఆ యువకుడు నన్ను లోపలకు లాగాడు. వ్యాన్‌లో నాపై లైంగిక వేధింపులకు పాల్పడి నా దుస్తులను చించేశాడు. అలా కాసేపు తిరిగాక ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ నన్ను పడేశారు. నా దగ్గర ఉన్న డబ్బులతో పాటు ఓ క్రెడిట్ కార్డును లాక్కెళ్లి అక్కడ నుంచి పరారయ్యారు. గాయాలతోనే ఎలాగోలా కొంత దూరం నడిచి ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగాను. అతను నన్ను ఫన్ రిపబ్లిక్ అవుట్ పోస్ట్ వద్ద డ్రాప్ చేసి వెళ్లాడు.
--బాధితురాలు
మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్..
రోగులకు అనస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తున్న ఉదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ థియేటర్లో నొప్పి భరించలేక రోగులు అరుస్తుంటే.. ఆ కేకలతో ఆస్పత్రి ప్రాంగణమంతా మారుమోగిపోతోంది. అయినా కానీ చలించని ఆ సిబ్బంది మిగతా పేషంట్లను బలవంతంగా తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది.
ఖగారియాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దాదాపు 30 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. అయితే అందులో 23 మందికి మత్తుమందు ఇవ్వకుండానే బలవంతంగా ఆపరేషన్ చేశారు. ఇది చూసిన మరో 7 మంది అక్కడ నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారమంతా చీఫ్ సర్జన్ దృష్టికి వెళ్లగా..ఆయన దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని అలాగే బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.