Rajya sabha seats NDA majority : నీతీశ్‌కుమార్ సారథ్యలోని జేడీయూ భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకోవటంతో రాజ్యసభలో ఎన్డీఏకు ఎదురుదెబ్బ తగలనుంది. ఏదైనా బిల్లు నెగ్గాలంటే తటస్థ పార్టీల మద్దతు తప్పనిసరి కానుంది. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్‌పర్సన్ సహా జేడీయూకు ఐదుగురు సభ్యులు ఉన్నారు. అయితే జేడీయూ భాగస్వామ్యపక్షంగా ఉన్నప్పుడు కూడా ఎన్డీఏకు పెద్దలసభలో పూర్తిస్థాయిలో మెజార్టీ లేదు. గత మూడేళ్లలో ఎన్డీఏను వీడిన మూడో రాజకీయ పార్టీ జేడీయూ. అంతకుముందు శివసేన, శిరోమణి అకాలీదళ్... అధికార కూటమి నుంచి బయటకు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలిగింది. తాజాగా నీతీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీయూ కూడా కూటమిని వీడటంతో అధికారపక్షానికి గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయి. పెద్దల సభలో కీలక బిల్లులు నెగ్గాలంటే తటస్థ పార్టీలైన బీజేడీ, వైకాపా మద్దతు తప్పనిసరి కానుంది.
Rajya sabha seats NDA today : రాజ్యసభలో ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జమ్ముకశ్మీర్‌లో 4, త్రిపురలో ఒకటి, మూడు నామినేటెడ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో మెజార్టీ మార్క్ 119గా ఉంది. జేడీయూ కలిసి ఉన్నంతవరకు ఎన్డీఏకు ఐదుగురు నామినేటెడ్, ఒక స్వతంత్రుడు కలిపి 115మంది సభ్యుల బలం ఉండేది. జేడీయూ వైదొలిగిన తర్వాత ఎన్డీఏ బలం 110కి పడిపోయింది. అంటే మెజార్టీ మార్క్‌కు మరో 9స్థానాలు తక్కువ అవుతాయి. శీతాకాలం పార్లమెంటు సమావేశాల నాటికి ముగ్గురు సభ్యులను నామినేట్ చేసేందుకు అవకాశం ఉంది. త్రిపురలో ఎన్నిక జరిగితే ఆ ఒక్క స్థానం కూడా భారతీయ జనతా పార్టీ నెగ్గే సూచనలు ఉన్నాయి. అప్పుడు రాజ్యసభలో ఎన్డీఏ బలం 114కు పెరుగుతుంది. అప్పుడు మెజార్టీ మార్క్ 122కు చేరనుండగా అధికార పక్షానికి మరో 8మంది సభ్యులు తక్కువవుతారు. లోక్‌సభలో పూర్తి మెజార్టీ కలిగిన ఎన్డీఏకు.. కీలక బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే 9మంది చొప్పున సభ్యులున్న వైకాపా, బీజేడీ మద్దతు తప్పనిసరి కానుంది.
ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా, తెలుగుదేశం, బీజేడీ, బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్.. అధికార ఎన్డీఏకు మద్దతు ఇచ్చాయి.