ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయంటే.. అభివృద్ధి పనులు చకచకా జరిగిపోతాయి! కొత్త రోడ్లు వస్తాయి.. కొత్త నీటి పంప్‌లు వస్తాయి. ఇలా చాలా వరకు అన్నీ కొత్తకొత్తగా కనిపిస్తాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలే అన్ని పనులు దగ్గరుండి మరీ చేయిస్తారు! కానీ బిహార్ గయాలోని శంకర్ బిఘా గ్రామంలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ నెల 29న జరగనున్న స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రజలు తహతహలాడుతున్నా ఓటు వేయలేని దుస్థితి. వారి గ్రామంలో ప్రవహిస్తున్న నదిపై వంతెన లేకపోవడం వల్ల పోలింగ్ బూత్‌కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యజీవితంలో అధికారుల నుంచి సహాయం లేకపోయినా ఇన్నేళ్లు ఏదో ఒక విధంగా నెట్టుకొచ్చారు. కానీ ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేయాలన్న సంకల్పంతో పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. వెంటనే గ్రామస్థులంతా కలిసి నదిపై తాత్కాలిక వంతెనను నిర్మించేశారు.
"29న ఎన్నికలు ఉన్నాయి కదా.. అందుకే ఈ వంతెన నిర్మించాము. వంతెన లేకుండా నది దాటుకుని వెళ్లి ఓటు వేయడం చాలా కష్టం. ఎన్నికల కోసం అందరం కలిసికట్టుగా బ్రిడ్జ్‌ను నిర్మించాము. అభివృద్ధి కోసం పాటు పడే అభ్యర్థి, యువ నేతను ఎన్నుకునేందుకు గ్రామంలో చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. మేము ఓటే వేయకపోతే అసలు మంచి నేత ఎలా ఎదుగుతాడు? అందుకే ఇలా చేశాము."
-- నీరజ్ కుమార్, గ్రామస్థుడు.
ఓటు వేయాలన్న సంకల్పం తమకు ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. తమ ఇబ్బందులను లెక్కచేయడం లేదన్నారు. అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందదని గుర్తించి.. గ్రామస్థులంతా కలిసి వంతెన నిర్మించినట్టు వెల్లడించారు. ఈ నెల 29న జరగనున్న ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తామని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు.
గ్రామస్థులు వంతెన నిర్మిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. "ఈ బ్రిడ్జ్.. ప్రభుత్వం కట్టించిన దాని కన్నా దృఢంగా ఉంటుంది" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అంతకుముందు.. ప్రభుత్వ సహకారం లేకుండానే కాలువపై వంతెనను నిర్మించి వార్తల్లోకెక్కింది కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని గ్రామం మోగ్ర. బ్రిడ్జి కోసం ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. నేతలు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం వల్ల, తామే స్వయంగా వంతెన నిర్మించి అందరి చూపు తమ వైపు తిప్పుకున్నారు.
ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చూడండి: లాక్‌డౌన్‌లో శ్రమదానం.. సొంతంగా రోడ్డు వేసుకున్న గ్రామస్థులు
గ్రామస్థులు ఇచ్చిన డబ్బుతో ఒలింపిక్స్‌కు.. పతకంతో స్వదేశానికి