Bihar man shot ex wife: బిహార్‌లో దారుణ ఘటన జరిగింది. నడిరోడ్డుపైనే తన మాజీ భార్య, కూతురిపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నాడు ఓ వ్యక్తి. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. తుపాకీ చేతబట్టిన వ్యక్తిని రాజీవ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బెగుసరాయ్ అతడి స్వస్థలమని తెలిపారు. కుటుంబ కలహాల వల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వివరించారు.
Bihar man shot ex wife: రాజీవ్ మాజీ భార్య ప్రియాంక భారతి(30) గర్దనీబాగ్లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో తన తల్లి, చెల్లెలి కూతురితో కలిసి బయటకు వెళ్లింది. వీరి కోసం కాచుకొని ఉన్న రాజీవ్.. తుపాకీ పట్టుకొని వచ్చి వారిని ఆపేశాడు. అక్కడ కాసేపు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పరిస్థితిని ఆ మహిళలు అర్థం చేసుకునేలోపే.. కాల్పులు చేశాడు రాజీవ్. తొలుత తన కూతురు సంస్కృతి ప్రభ(14)ను కాల్చేశాడు. అనంతరం, తన మాజీ భార్య ప్రియాంకను కాల్చి చంపాడు. వీరిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలారు. అనంతరం, తనను తాను కాల్చుకున్నాడు రాజీవ్. క్షణకాలంలోనే ముగ్గురూ విగతజీవులయ్యారు.
నిజానికి రాజీవ్.. ప్రియాంక అక్కను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆమె సహజ మరణం పొందిన నేపథ్యంలో... ప్రియాంకను పెళ్లాడాడు. అయితే, వీరిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. రాజీవ్‌కు అతని మొదటి భార్యకు పుట్టిన అమ్మాయే సంస్కృతి. తండ్రితో కలిసి ఉండేందుకు సంస్కృతి కూడా నిరాకరించింది. అందుకే తనకు పిన్ని వరసయ్యే ప్రియాంక దగ్గరే ఉంటోంది. తనను వేధింపులకు గురి చేస్తున్నాడని మూడేళ్ల క్రితం రాజీవ్‌కు ప్రియాంక విడాకులు ఇచ్చింది. అనంతరం వాయుసేనలో పనిచేసే మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. పట్నాలో విశ్రాంత పోలీసు అధికారుల కాలనీగా పేర్కొనే ఓ విలాసవంతమైన ప్రాంతంలో వీరు అద్దెకు ఉంటున్నారు. తన కూతురిని తనకు అప్పగించాలని రాజీవ్ ప్రియాంకను డిమాండ్ చేస్తున్నాడు. ప్రియాంక ఇందుకు నిరాకరించింది. కావాలంటే కోర్టుకు వెళ్లాలని తేల్చి చెప్పింది. ఇదే హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: 'పద్మశ్రీ'కి అవమానం.. నడిరోడ్డుపైకి 90 ఏళ్ల కళాకారుడు