Khakee IPS officer : బిహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోఢా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' అనే వెబ్ సిరీస్‌తో ఈ అధికారి పేరు సంచలనమైంది. తన జీవితంలోని ఓ కీలకఘట్టాన్ని స్పృశిస్తూ ఆయనే స్వయంగా రాసిన 'బిహార్ డైరీస్' పుస్తకాధారంగా ఈ సిరీస్ రూపొందింది.
అయితే, తన పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో అమిత్ రూ.1కి ఒప్పందం చేసుకున్నారు. వాస్తవంలో ఆయన సతీమణి బ్యాంకు ఖాతాకు రూ. 49లక్షలు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సిరీస్ ఒప్పందానికి ముందే ఖాతాలో నగదు జమైందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. మగధ్ రేంజ్‌కు అమిత్ ఐజీగా ఉన్న సమయంలో అది జరిగిందని తెలిపారు. గయలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమితులైనప్పటి నుంచి లోఢా అక్రమంగా సంపాదిస్తున్నారని, అతడి పుస్తకాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు అనుమతి ఉండదని అమిత్‌పై ఫిర్యాదు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఓ డీఎస్పీని నియమించారు.
బిహార్‌లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారి.. ఒకే రోజు 24 హత్యలకు కారణమైన ఓ వ్యక్తిని పోలీసు అధికారి ఎలా పట్టుకున్నారనే కథాంశంతో 'ఖాకీ' సిరీస్ రూపొందింది. ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్'లో ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.