మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాతో ఈ నెలాఖరులో సమావేశంకానున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. పౌరసత్వ చట్ట సవరణ అంశంలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్టు పేర్కొన్నారు షా.
"మేఘాలయ సీఎం కాన్రాడ్.. ఆ రాష్ట్రంలోని సమస్యల గురించి వివరించటానికి నన్ను కలిశారు. పౌర చట్టంలో ఇంకా కొన్ని మార్పులు చేయాలని ఆయన కోరారు. క్రిస్మస్ తరువాత సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని కాన్రాడ్కు హమీ ఇచ్చాను. ఈ విషయంలో ఎవరు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. "
-అమిత్ షా, హోమంత్రి.
పౌరసత్వ చట్ట సవరణపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని.. ఈశాన్య రాష్ట్రాల్లో హింసను ప్రేరేపిస్తోందని మరోమారు ఆరోపించారు షా.
"ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లిం, బౌద్ధ, క్రైస్తవ, పార్శీ, సిక్కు శరణార్థులు మతపరమైన హింసలకు గురై దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారికి సరైన ఆహారం, ఉద్యోగాలు, వైద్యం అందటంలేదు. అలాంటి వారిని పౌరులుగా చేయాలా వద్దా? వీరి కోసం మేము పౌరసత్వ (సవరణ) బిల్లును తీసుకువచ్చాము. దీనిని కాంగ్రెస్.. ముస్లిం వ్యతిరేకమని అంటోంది. మేము ముమ్మారు తలాక్ తీసుకువచ్చినప్పుడు వారు మమ్మల్ని ముస్లిం వ్యతిరేకులు అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. "
-అమిత్ షా, హోమంత్రి.
అసోం, ఈశాన్య ప్రాంత ప్రజల భాష, సంస్కృతి, సామాజిక, రాజకీయ హక్కులను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎల్లప్పుడు పరిరక్షిస్తుందని హామి ఇచ్చారు షా.
ఇదీ చూడండి:'పౌర' చట్టంపై సుప్రీంలో సవాల్: భాజపా మిత్రపక్షం