పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ ఆదివారం దద్దరిల్లింది. జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులు, స్థానికులు కలసి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నాలుగు బస్సులకు ఆందోళనకారులు నిప్పంటించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేయాల్సి వచ్చింది.
ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి జామియానగర్ వద్ద పోలీసులు లాఠీలు ఝుళిపించి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో 60 మందికి గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించారని విద్యార్థులు ఆరోపించారు. హింసకు తాము కారణం కాదని... కొందరు స్థానికులే బస్సులకు నిప్పంటించి గందరగోళం సృష్టించారని వారు తెలిపారు.
ఆదివారం అర్ధరాత్రి దాటాక దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్దకు వేలాది మంది చేరుకుని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు.
స్తంభించిన ట్రాఫిక్...
హింసాత్మక ఘటనల నేపథ్యంలో మథుర రోడ్ సహా జేఎంఐకి దారితీసే మార్గాల్లో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అటు మెట్రో స్టేషన్ల మూసివేత.. ఇటు ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నిరసనకారులు శాంతియుతంగా మెలగాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
హింసకు పాల్పడి జేఎంఐ ప్రాంగణంలో తలదాచుకున్నవారిని గుర్తించడానికంటూ పోలీసులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించారు. విద్యాసంస్థలోకి పోలీసులు రావడాన్ని జేఎంఐ వర్గాలు తప్పుబట్టాయి. ఈ ఘటనల్ని నిరసిస్తూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) విద్యార్థులు.. దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆగ్నేయ దిల్లీలోని పాఠశాలల్ని సోమవారం మూసివేయనున్నారు.
విడుదల చేయండి...
నిరసనల్లో అదుపులోకి తీసుకున్న గాయపడిన జామియా విశ్వవిద్యాలయం విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని లేదా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని దిల్లీ మైనారిటీ కమిషన్.. కాల్కాజీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులకు తెలిపింది.