కరోనా కట్టడి నిబంధనలను పార్లమెంటు సభ్యులందరూ విధిగా పాటించాలని కోరారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. సభ కొనసాగుతున్న సమయంలో సభ్యులు మరొకరి సీట్ల వద్దకు గానీ, టేబుల్ హౌస్ వద్దకు గానీ వెళ్లొద్దని సూచించారు.
"సభ కొనసాగుతున్నప్పుడు సభ్యులు ఎవరూ టేబుల్ ఆఫీస్ వద్దకు రాకూడదు. ఇతర సభ్యుల సీటు వద్దకు వెళ్లి చెవిలో మాట్లాడటం చేయకూడదు. ఏదైనా మాట్లాడేది ఉంటే చీటీలను పంపించండి. పరీక్షల్లో స్లిప్పులు పాస్ చేసుకోవడం నిషేధం కానీ.. ఇక్కడ(రాజ్యసభలో) వీటికి అనుమతి ఉంది."
-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్
ఛైర్మన్ కార్యాలయానికి కూడా సభ్యులు రాకుండా ఉండాలని సూచించారు వెంకయ్య.
కరోనా జాగ్రత్తలో భాగంగానే
కరోనా వ్యాపిస్తున్న సమయంలోనూ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మాస్కులు, సురక్షిత దూరం వంటి నిబంధనలు పాటించేలా సభ్యులకు సూచనలు ఇస్తున్నారు. మరోవైపు పార్లమెంట్‌కు వచ్చే విలేకరులకు, సిబ్బందికి ప్రతి రోజు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.