విశాఖ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఒకరిని అరెస్టు చేసింది. కీలక నిందితుడు ఇమ్రాన్ గితేలిని గుజరాత్‌లోని గోద్రా వద్ద సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. సరిహద్దు వస్త్ర వ్యాపారం ముసుగులో ఇమ్రాన్ గితేలి.. పాక్ గూఢచారులు, ఏజెంట్లతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించింది.
ఇమ్రాన్ ఇంట్లో సోమవారం జరిపిన సోదాల్లో... డిజిటల్ పరికరాలు, రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ పేరుతో విచారణ చేపట్టిన విచారణ సంస్థలు.. భారత నౌకాదళ ఓడల కదలికలపై ఏజెంట్లను నియమించినట్లు గుర్తించాయి. పాక్ ఆధారిత గూఢచారులు, భారత జలాంతర్గాముల కదలికలపైనా ఏజెంట్లను నియమించినట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి.
ఖాతాల్లోకి డబ్బులు..
రక్షణ సంస్థల కదలికలపై వర్గీకృత సమాచార సేకరణకూ ఏజెంట్లను నియమించారని గుర్తించాయి. కొందరు నేవీ సిబ్బంది పాక్ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. పాక్ నిఘా సంస్థ-ఐఎస్ఐకి చెందిన భారతీయ సహచరుల ద్వారా తమ ఖాతాల్లోకి నగదు జమ చేసుకున్నట్లు తేలింది. జమ చేసిన నగదుకు బదులుగా నేవీ సమాచారం పంచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ మేరకు గూఢచర్యం కేసులో మొత్తం 14 మందిపై ఎన్ఐఏ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది.