దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగేందుకు కారణమైన తబ్లిగ్-ఎ-జమాత్ సభ్యులు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్ నిర్బంధ కేంద్రంలో ఉన్న కొంత మంది జమాత్ సభ్యులు.. అక్కడ పని చేస్తున్న ఓ నర్సు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆసుపత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి ఐసొలేషన్ వార్డు పరసరాల్లో అర్ధనగ్నంగా తిరగటం, నర్సింగ్ సిబ్బంది సమీపంలో అసభ్యంగా పాటలు పాడటం వంటి చర్యలకు పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై స్పందించారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
"వారు చట్టాన్ని, నిబంధనలను పాటించరు. మహిళా సిబ్బంది పట్ల వారు ప్రవర్తించిన తీరు క్షమించరాని నేరం. వీరిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వీరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు."
-యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి.
ఈ ఘటన అనంతరం ఆరుగురు తబ్లిగ్ సభ్యులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరొక ప్రైవేట్ ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నర్సులపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై సెక్షన్ 269, 270, 271, 294, 354 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించాలని కేంద్ర ఆదేశించిన నేపథ్యంలో వారి కోసం జల్లెడ పడుతున్నారు అధికారులు. మొత్తం 150 మందిని గుర్తించిన అధికారులు ఘాజియాబాద్‌లోని వివిధ నిర్బంధ కేంద్రాలకు తరలించారు.
కఠిన చర్యలు...
దేశంలోని వైద్యుల విధులకు ఆటంకాలు కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇప్పటి వరకు మొత్తం 647 మంది జమాత్ సభ్యులకు కరోనా సోకినట్లు ప్రకటించింది కేంద్రం. ఈ కేసులన్నీ 14 రాష్ట్రాల్లో నమోదైనట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:50మీల్ ప్యాక్ ఛాలెంజ్.. మీరూ చేయగలరా..!