సమాజంలో చాలా రకాల పెళ్లిళ్లను చూసి ఉంటారు. ఇద్దరు పురుషులు ఒక్కటవడం.. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం.. అలాగే బాల్య వివాహాలు లాంటివి ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయితే ఒడిశాలోని సాయూర్భంజ్ జిల్లా కరాంజియా బారియా గ్రామంలో మాత్రం విచిత్రంగా పసి పిల్లలకు శునకాలతో వివాహం చేస్తున్నారు.
కొన్ని తరాలుగా ఇక్కడ చిన్నారులకు కుక్కలతో వివాహం జరిపించడం సంప్రదాయంగా వస్తోంది.
ఎందుకంటే..
సాధారణంగా పుట్టిన పిల్లలకు మొదటిసారిగా వచ్చిన పాల దంతాలు కింది దవడన వస్తాయి. అలా కాకుండా పై దవడన వచ్చినట్లయితే... అది పెద్ద దోషంగా భావిస్తారు బారియా గ్రామస్థులు. చిన్నారులకు శునకాలతో వివాహం జరిపిస్తే ఈ దోషం పోతుందని వారి విశ్వాసం.
ఈ క్రమంలో మగపిల్లలను వరుడిలా తయారు చేసి ఆడ కుక్కతో వివాహం చేస్తారు. ఇదే మాదిరిగా ఆడ పిల్లలకు మగ కుక్కలతో వివాహం జరిపిస్తారు. సాధారణ పెళ్లి లాగే సంగీతం, డీజేలు, బ్యాండు భాజా, విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. గ్రామంలో ఇద్దరు మగ, ఒక ఆడ పిల్లకు వివాహం జరిపించిన ఘటన వెలుగుచూసింది.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్ : ఆగ్రా నుంచి దిల్లీ పయనం