కాలం 3 సంవత్సరాలు. మథనం 165 రోజులు. అధికరణలు 395. షెడ్యూళ్లు 12. ఆమోదం పొందింది 1949 నవంబరు 26. అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26.. గణాంకాల్లో చూస్తే ఇదీ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం.
రాజ్యాంగం ఆత్మ లోతుల్లోకి వెళితే మాత్రం అదో మహా చరిత్రాత్మక, విప్లవాత్మక పత్రం. దీనివెనుక ఎన్నో పోరాటాలు, మరెన్నో ఆకాంక్షలు, సామాజిక విప్లవ అభినివేశాలు కనిపిస్తాయి. కుల, మత, వర్గ, వర్ణ, లింగ వివక్ష లేకుండా ఒకే తరహా హక్కులు.. ఆస్తితో సంబంధం లేకుండా అందరికీ ఓటు హక్కు.. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం.. స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన అధికార విభజన.. అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక రక్షణలు.. గిరిజనులకు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు.. అధికార మతం అంటూ లేని లౌకికవాదం.. ఇవన్నీ కలగలిసి ఒకేసారిగా అమల్లోకి రావడం ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు.
అసాధారణ విజయం
ఆధునిక ప్రజాస్వామ్యానికి పుట్టినిళ్లుగా చెప్పుకొనే పలుదేశాల్లో మన రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కుల్లాంటివి రావడానికి ఏళ్లు పట్టింది. దేశ విభజనకు కారణమైన మతవాదం ఓవైపు నుంచి కమ్ముకొస్తున్నా.. ఆ పొరలను చీల్చుకుంటూ దాని ప్రభావం పడకుండా రాజ్యాంగ రచన చేయడానికి మహా యజ్ఞమే జరిగింది. ఆ మేధోమథనం అంతా అక్షరబద్ధం అయింది. ఒక్కో అధికరణం రూపొందడానికి ఎంత భావ సంఘర్షణ జరిగిందో చెప్పేందుకు 11 మహా సంపుటాలే సాక్ష్యాలు.
భిన్న దృక్పథాల ఏకత
మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం 1946 డిసెంబరు 9న జరిగింది. రాజ్యాంగ పరిషత్‌లో 82 శాతం సభ్యులు కాంగ్రెస్‌కు చెందిన వారే. వీళ్లందరి ఆలోచనలు, దృక్పథాలు ఒక తీరులో ఉండేవి కావు. వీళ్లందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రపంచంలో అతి పెద్దదయిన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడం మామూలు విషయం కాదు. దీన్ని ఎంత సమర్థంగా నిర్వహించినా మొత్తం కసరత్తు కాంగ్రెస్ నేతలకే పరిమితమైతే మన రాజ్యాంగం కూడా పరిమిత పరిధుల్లోనే ఉండేదేమో! అయితే రాజ్యాంగ నిర్మాణాన్ని పార్టీ వ్యవహారంగా కాంగ్రెస్ చూడలేదు. రాజ్యాంగ రూపకల్పనలో ఇతర పార్టీలకు చెందిన నేతలకు, రాజ్యాంగపరమైన అంశాల్లో గట్టి పట్టున్న ప్రముఖులకు సముచిత స్థానం కల్పించింది. రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ సారథ్యాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు అప్పగించడమే అందుకు నిదర్శనం.
మహామహుల కృషి
అంబేడ్కర్ తన అసమాన ప్రతిభతో బాధ్యతలను నిర్వహించారు. 300 మంది వరకు రాజ్యాంగ పరిషత్‌లో ఉన్నప్పటికీ కీలక పాత్ర వహించింది 20 మంది మాత్రమే. కాంగ్రెస్ వైపు నుంచి జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ ముఖ్యభూమిక పోషించారు. కెం.ఎం.మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ల పాత్ర కూడా గణనీయమైందే. రాజ్యాంగ పరిషత్‌కు న్యాయ సలహాదారుగా వ్యవహరించిన బి.ఎన్.రావు, చీఫ్ డ్రాఫ్ట్స్‌మన్‌గా వ్యవహరించిన ఎస్.ఎన్.ముఖర్జీలదీ అద్వితీయ పాత్రే.
సమైక్యతకే అగ్రాసనం
బ్రిటిష్ పాలకులు రూపొందించిన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా విషయాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల అనుభవాల నుంచి చాలా విషయాలు తీసుకున్నారు. దీంతో రాజ్యాంగంలో భారతీయతను లేకుండా చేస్తున్నారన్న విమర్శలు ఆనాడే వచ్చాయి. గ్రామం ఆలంబనగా వికేంద్రీకరణ పాలనకు మహాత్మా గాంధీ సూచించిన విధంగా రాజ్యాంగం రూపొందాలని కొందరు కోరినా దానికి మద్దతు లభించలేదు. చివరికి వ్యక్తి హక్కుల ఆధారంగానే ఆధునిక రాజ్యాంగాలు రూపొందాయని.. పంచాయతీలకో, అలాంటి ఇతర సంస్థలకో ఆ హక్కులు ఇవ్వడం సమంజసం కాదనే వాదనే నెగ్గింది.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలు గురించి చాలా చర్చే జరిగింది. పన్నుల ఆదాయంలో కేంద్రానికే ఎక్కువ అధికారాలు కల్పించడంపై కూడా విమర్శలొచ్చాయి. నిర్దిష్ట అధికారాలతో రాష్ట్రాలకు ప్రత్యేక అస్తిత్వాన్ని కల్పించే సమాఖ్య వ్యవస్థకు అంగీకరించినా జాతి సమైక్యతను కాపాడే వ్యవస్థగా కేంద్ర ప్రభుత్వానికే కీలక విషయాల్లో పెద్దపీట వేశారు. బలమైన కేంద్రం గురించి అంబేడ్కర్ గట్టిగా వాదించారు.
రిజర్వేషన్ల అండ
ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని కొందరు కోరినా పటేల్ దాన్ని మొగ్గలోనే తుంచేశారు. అలా కోరుకునే వారికి పాకిస్థాన్‌లో తప్ప భారత్‌లో స్థానం లేదని, ప్రత్యేక నియోజకవర్గాలు ముస్లింలను జాతి జీవనంలో సంపూర్ణంగా కలవకుండా చేస్తాయని, విచ్ఛిన్నానికి అవి బీజాలు వేస్తాయని పటేల్ స్పష్టంగా చెప్పారు. మహిళా రిజర్వేషన్ల డిమాండ్‌ను కూడా పరిషత్ తిరస్కరించింది. తరతరాలుగా బాధలను, వెలివేతలను అనుభవించిన, అస్పృశ్యతకు గురవుతున్న కులాల వారికి మాత్రమే విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లను కల్పించాలని పరిషత్‌లో మొదట అంగీకారం కుదిరింది. 1928 ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు సారథ్యం వహించి బంగారు పతకాన్ని సాధించటంలో కీలకపాత్ర పోషించిన జైపాల్‌సింగ్ తన అద్భుత వాదనాపటిమతో దేశంలో గిరిజనుల దుస్థితిని సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం చర్పోపచర్చలు జరిగి గిరిజనులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు.
హక్కులకు పెద్దదిక్కు
ప్రాథమిక హక్కుల విషయంలో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రాజ్యాంగ లక్ష్యాలను సూచించే తీర్మానాన్ని 1946 డిసెంబరు 13న నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టారు. అందులో భారత పౌరులకు ఎలాంటి హక్కులను కల్పించాలో దిశానిర్దేశం ఉంది. ఇక ఆదేశిక సూత్రాలను పొందుపరచడంలో వివిధ వర్గాల ఆకాంక్షలకు పెద్దపీట వేశారు. గోవధ నిషేధం, ఉమ్మడి పౌరస్మృతి లాంటివి అందులో ఉన్నాయి. జాతీయభాషగా ఏది ఉండాలనే విషయంపై లోతుగానూ, కొన్ని సందర్భాల్లో భావోద్వేగంతోనూ చర్చలు జరిగాయి. చివరికి అధికారభాషగా హిందీని గుర్తిస్తూ.. 15 ఏళ్లపాటు ఇంగ్లీష్‌ని కొనసాగించాలని నిర్ణయించారు.
జనవాణికి ఆహ్వానం
మన రాజ్యాంగానికి సంబంధించి ఇంకో విశిష్టత కూడా ఉంది. విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానించారు. ఎన్నో వినతులు అందాయి. వాటన్నింటినీ అధ్యయనం చేశారు. ఆహారకొరత, మత సంఘర్షణలు, లక్షల సంఖ్యలో శరణార్థులు, స్వదేశీ సంస్థానాల మొండిపట్టు, కశ్మీర్‌లో గొడవలు ఒక వైపు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలోనే రాజ్యాంగ రచన సంయమనంతో చేపట్టాల్సి వచ్చింది.
అమలు.. ఆ తర్వాత..
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతా ప్రయాణం సాఫీగా సాగలేదు. భూసంస్కరణలకు, హిందూ కోడ్ బిల్లుకు అప్పట్లో రాష్ట్రపతి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాను మంత్రివర్గ సలహాకు బద్ధుడనై ఎందుకుండాలని రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. అలా ఉండక తప్పదని రాజ్యాంగ నిపుణులు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సామాజిక, ఆర్థిక న్యాయం కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయడానికి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. న్యాయస్థానాల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో సానుకూలత వ్యక్తం కాలేదు. న్యాయస్థానాల తీర్పుల నుంచి తప్పించుకోవడానికే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితి కాలంలో పలు రాజ్యాంగ మౌలిక నియమాలను నీరుగార్చటానికి 42వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చారు. తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం ఆ మార్పులను నిరోధిస్తూ రాజ్యాంగ సవరణను తీసుకుని రావటంతో పరిస్థితి కుదుటపడింది.
న్యాయతీర్పులతో రక్షణ
న్యాయ క్రియాశీలత అనే అస్త్రంతో పలువురు సర్వోన్నత న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులతో రాజ్యాంగానికి అనేక రక్షణలతో పాటు పలు ప్రజానుకూల వ్యాఖ్యానాలు వచ్చాయి. కేశవానందభారతి కేసులో రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇచ్చిన నిర్వచనం కార్యనిర్వాహకవర్గం బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ఎంతో తోడ్పడింది. 1990ల్లో లౌకిక వాదం ఒక విలువగా చాలా ఒడిదుడుకులకు లోనైనా తట్టుకుంది. మహా ఉద్గ్రంథంగా వేనోళ్ల కొనియాడే భారత రాజ్యాంగం 70 ఏళ్ల క్రితం.. 1949 నవంబరు 26న ఆమోదం పొందింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఇన్నేళ్ల విజయానికి సారథి సామాన్య మానవుడే. అందుకే క్రమం తప్పకుండా ఎన్నికలూ జరుగుతున్నాయి. బహుళపార్టీ రాజకీయ ప్రజాస్వామ్యం వర్థిల్లుతోంది.
(రచయిత- ఎన్. రాహుల్ కుమార్)