భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 4 వేల కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా సైన్యం కదలికలపై కన్నేసి ఉంచాలని భావిస్తోంది భారత సైన్యం. అందుకోసం 4 నుంచి 6 ఉపగ్రహాలు అవసరమని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. తద్వారా డ్రాగన్ దుశ్చర్యలను సులువుగా గుర్తించవచ్చని అంటున్నాయి.
చైనా 40 వేల మంది సైనికులు సహా ఆయుధ సామగ్రిని ఎల్ఏసీ వద్ద మోహరించిన నేపథ్యంలో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
" భారత భూభాగంతో పాటు కీలక ప్రాంతాల్లో చైనా బలగాల కదలికలపై నిఘాను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అధిక ఎత్తు నుంచి కూడా భూ ఉపరితలంపై స్పష్టమైన చిత్రాలు తీయగల హై రిజల్యూషన్ కెమెరాలతో కూడిన ఉపగ్రహాలు అవసరమవుతాయి. తద్వారా చైనాపై నిఘా ఉంచడానికి ఇతర దేశాల సాయం కోరనవసరం లేదు."
- సైనిక వర్గాలు
భారత సైన్యం వద్ద ఇప్పటికే గస్తీ ఉపగ్రహాలు ఉన్నప్పటికీ... చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత అధునాతనమైనవి కావాలని భద్రతా బలగాలు కోరుతున్నాయి. చైనా కదలికలపై స్పష్టత లేనందున సరిహద్దులకు సేనల తరలింపులో జాప్యం ఏర్పడుతోందని అభిప్రాయపడుతున్నాయి. అటు, చైనా సైన్యం.. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం సహా అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో తమ బలగాల మోహరింపును పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉప గ్రహాలను సమకూర్చుకోవాలని భారత సైన్యం భావిస్తోంది.
ఇదీ చూడండి: సరిహద్దులో చైనా దురాక్రమణ నిజమే: రక్షణశాఖ