భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కి సమీపంలోని గ్రామాలు ఖాళీ అవుతున్నాయన్న వార్తలను ఖండించింది భారత సైన్యం. అలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం హానికరమని పేర్కొంది. పుకార్లను నమ్మొద్దని అరుణాచల్‌ప్రదేశ్, అసోం ప్రజలను కోరారు తేజ్‌పుర్ రక్షణ శాఖ ప్రజాసంబంధాల అధికారి.
"ఎల్ఏసీ సమీప గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారన్న వార్తలు అవాస్తవం. తప్పుడు వార్తలను నమ్మొద్దని అరుణాచల్‌ప్రదేశ్, అసోం ప్రజలను కోరుతున్నాం. ఏ సమాచారం అయినా రీట్వీట్ చేసే ముందు సంబంధిత అధికారుల ద్వారా ధ్రువీకరించుకోవాలి."
- పీఆర్ఓ, రక్షణ శాఖ తేజ్‌పుర్
తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్ తవాంగ్‌లోని మెక్‌మోహన్ రేఖకు సమీప గ్రామాలు ఖాళీ అవుతున్నట్లు మీడియా నివేదికల నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చింది సైన్యం.
సరిహద్దులో దురాక్రమణలకు ప్రయత్నిస్తున్న చైనాకు దీటైన సమాధానం చెబుతోంది భారత్. ఇటీవల పాంగాంగ్ సరస్సు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక పర్వతాలను స్వాధీనం చేసుకుని చైనా కంగుతినేలా చేసింది సైన్యం. దౌత్య, సైనిక, రక్షణ మంత్రుల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ.. సమస్య కొలిక్కి రావటం లేదు. గురువారం(సెప్టెంబర్ 10న) రష్యా వేదికగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు.
ఇదీ చూడండి: 'అవును.. ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు: చైనా'