కరోనా రోగుల చికిత్స, మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. సుమోటోగా తీసుకొని ఈ కేసును జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఆస్పత్రులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నిపుణుల ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రి కరోనా వార్డుల్లో భయంకర పరిస్థితులు ఉన్నట్లు తెలిశాక సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని, రోగులకు మెరుగైన చికిత్స అందుతుందని అభిప్రాయపడింది.
కరోనా నిర్ధరణ పరీక్షల ధర కూడా దేశమంతా ఒకేలా ఉండేలా చూడాలని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. కొన్ని రాష్ట్రాల్లో రూ.2200, మరికొన్ని రాష్ట్రాల్లో రూ.4500గా కరోనా టెస్టుల ధర ఉన్నట్లు గుర్తు చేసింది. కేంద్రమే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
ఆస్పత్రులలో కరోనా చికిత్స నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాల్, గుజరాత్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. ఆస్పత్రులలో వాస్తవ పరిస్థితిని తెలియజేసే వీడియోలను లీక్ చేశారని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేసిన దిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా పరీక్షల ధరను తగ్గించేందుకు సంబంధిత భాగస్వామ్యపక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం తరఫు వాదనలు వినిపిస్తున్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.