రాజస్థాన్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సొంతపార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన అధికార కాంగ్రెస్.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు శతవిధాల కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సాయంత్రం 4 గంటలకు గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో భేటీ కానున్నారు.
ఇప్పటికే జైపుర్ ఫెయిర్మౌంట్ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. అవసరమైతే రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం ఇస్తామని, ప్రధాని అధికారిక నివాసం ముందు ధర్నా చేపడతామని ఈ సమావేశం వేదికగా ప్రకటించారు సీఎం గహ్లోత్.
గవర్నర్ను కలవనున్న భాజపా నేతలు..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా, విపక్ష నేత గులాబ్ చంద్ర మిశ్రా నేతృత్వంలో శనివారం సాయంత్రం గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించనున్నారు.