శుక్రవారం ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌లో మాఫియా డాన్ వికాస్ దుబేను ఎన్కౌంటర్లో హతమార్చారు పోలీసులు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు సహా పలువురు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ఎన్కౌంటర్ నెపంతో దుబేను అంతమొందించారని ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంపై సమాజ్‌వాది పార్టీ విమర్శలు గుప్పించింది. దుబే ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పలేదని, రహస్యాలు బయటకు రాకుండా యోగి ప్రభుత్వం మాయ చేసిందని ఆరోపించింది.
పోలీసులు ఏం చెప్పారు?
యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుబేను మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ నుంచి కాన్పుర్ తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దుబే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసుల వద్ద ఉన్న తుపాకీ తీసుకున్నాడు. ఆ తర్వాత అతన్ని చుట్టుముట్టిన పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుబే గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఘటన జరిగిన తీరు...
- ఉదయం 6:16 గంటలకు దుబేను కాన్పుర్ దేహాత్ జిల్లా కేంద్రం మతికి తీసుకెళ్లారు.
- 6:25 గంటలకు జిల్లాలోని అక్బర్పుర్ బారా టోల్ ప్లాజా వద్దకు దుబే ఉన్న వాహనం వచ్చింది.
- 6:30 గంటలకు ఎన్కౌంటర్లో దుబే హతమయ్యాడు.
- దుబేను కాన్పుర్ తీసుకెళ్తున్నప్పుడు పోలీస్ కాన్వాయ్‌లో 3 వాహనాలు ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన చోట రోడ్డు ప్రమాదం జరిగిన ఎస్యూవీ వాహనం కాన్వాయ్‌లో లేదు. కాన్వాయ్‌తో బయలుదేరినప్పుడు మీడియా వాహనాలను అనుమతించలేదు. సచేంది ప్రాంతంలోనే ఆపివేశారు.
లేవనెత్తుతున్న ప్రశ్నలు..
- 5 నిమిషాల్లోనే పోలీసులు 45 కి.మీ ఎలా ప్రయాణించారు?
- అంత తక్కువ సమయంలో ఎస్యూవీ వాహనం కాన్వాయ్‌లో ఎలా చేరింది?
- కాన్వాయ్‌ను అనుసరించకుండా మీడియాను ఎందుకు ఆపారు?
దుబేను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చే అవకాశాలున్నాయని, అలా జరగకుండా అతనికి యూపీ ప్రభుత్వం భద్రత కల్పించాలని గురువారం రాత్రే సుప్రీంకోర్టులో పిల్ దాఖలవడం గమనార్హం. మహారాష్ట్రకు చెందిన న్యాయవాది ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే దుబేను ఎన్కౌంటర్లో హతమార్చినందుకు యూపీ పోలీసులను ప్రశంసిస్తున్నారు కాన్పుర్ ఘటనలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు. అయితే ఈ ప్రశ్నలు, సందేహాలకు సమాధానం మాటేంటి?