యావత్ దేశమూ ఇప్పుడు కరోనాతో పోరాడుతోంది. ఎంతలా అంటే అన్ని పనులూ వదిలేసి మహమ్మారిని మట్టుపెట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని సర్వశక్తులూ ఒడ్డుతోంది. దేశంలో కొవిడ్ ఛాయలు బయటపడి శుక్రవారం నాటికి వంద రోజులు. దాదాపు 136 కోట్ల జనాభా ఉన్న దేశంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌లు, మరెన్నో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వీటితో కొంతమేర నిలువరించగలిగినా కరోనా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. వంద రోజుల్లో కేసులు 56 వేలు దాటిపోయాయి. మహమ్మారి జాడ కనిపించిన 40 రోజులకు ఒకరు చనిపోగా.. ఇప్పుడు మరణాలు 1,886 దాటిపోయాయి. కరోనాను తుదముట్టించడానికి 'శత'విధాలుగా భారత్ చేస్తున్న పోరాటంలో రెట్టించిన శక్తితో అందరూ ముందుకు ఉరకాల్సిన అవసరం ఉంది. ఈ 100 రోజుల్లో కొవిడ్ ప్రతాపం ఎలా ఉందో చూద్దాం..
లాక్‌డౌన్
భారత్‌లో ప్రజలంతా మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించారు. 24 నుంచి కేంద్రం లాక్‌డౌన్ విధించింది. అనంతరం రెండు సార్లు కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను పొడిగించింది.
ఊరట
దేశంలో కొవిడ్ సోకిన వారిలో శుక్రవారం నాటికి 16,540 మంది కోలుకున్నారు. అంటే మహమ్మారి బారిన పడినవారిలో 29.36 శాతం మంది దీన్ని జయించారు.
మరణాల రేటు
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ రోగుల్లో ప్రతి 100 మందికి 6.89 మంది చనిపోతున్నారు. భారత్‌లో ఈ మరణాల రేటు 3.35 శాతంగా ఉంది.
'మహా'కష్టం
భారత్‌లోని రాష్ట్రాల్లో అత్యధిక కేసులు, మరణాలతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. ఇంతవరకు 18 వేలకు చేరువలో కేసులు నమోదు కాగా, 700కు దగ్గర్లో మరణాలు సంభవించాయి.
పదింట ఉపశమనం
దేశంలో మొత్తం 33 రాష్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంతవరకు కేసులు బయట పడ్డాయి. వీటిలో 10 చోట్ల మరణాలేమీ లేకపోవడం కొంత ఊరట.
ఇదీ చూడండి:కరోనాకు టీకా అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో