కరోనా కట్టడికి రైలు కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే శాఖ బాటలోనే కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ పయనిస్తోంది. ప్రస్తుతం వాడకంలో లేని పాత బస్సులను మొబైల్ శానిటైజర్ టన్నెల్స్‌గా మార్చుతోంది.
ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే ప్రదేశాల్లో అధికారులు ఈ మొబైల్ టన్నెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టన్నెల్స్ లోపలి భాగంలో.. వైరస్‌ను నిరోధించే క్రిమి సంహారకాలు వెదజల్లే విధంగా రూపొందిస్తారు. ప్రజలు ఇందులో నుంచి వెళ్తే పూర్తిగా శానిటైజ్ అవుతారు.
పోలీసులు, వైద్య సిబ్బంది, అత్యవసర విపత్తు స్పందన దళం, పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుతం ఈ బస్సు టన్నెల్‌ను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు రెండు బస్ టన్నెల్స్‌ను తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులకు 'రవాణా సంజీవని'గా నామకరణం చేసినట్లు చెప్పారు.
"శానిటైజర్ బస్సు ముందు ద్వారం నుంచి ప్రజలు లోపలకు వెళ్లాలి. వెనుక ద్వారం నుంచి బయటకు రావాలి. ఇందులో నడుస్తున్న సమయంలో బస్సులో ఏర్పాటు చేసిన వ్యవస్థ నుంచి వైరస్‌ను నిరోధించే సంహారకాలు వెలువడతాయి."-అధికారులు
మైసూరుకు చెందిన 12 ఏళ్ల బాలుడు నిరుపయోగంగా ఉన్న బస్సులను శానిటైజర్ టన్నెల్‌గా మార్చాడు. రూ.12 వేల వ్యయంతో దీని తయారు చేసినట్లు తెలుస్తోంది. వీటిని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజిలెన్స్ డైరెక్టర్ డా. రామ్ విలాస్ సేపత్... మైసూరు రూరల్ డివిజన్ డిపో వద్ద లాంఛనంగా ప్రారంభించారు.