సుప్రీం ఇచ్చిన అయోధ్య తీర్పును గెలుపు ఓటముల పరంగా చూడవద్దని ప్రధాని నరేంద్రమోదీ.. దేశప్రజలకు సూచించారు. సుప్రీం తీర్పును స్వాగతించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈ నిర్ణయం దేశ ఐక్యతా సమగ్రతను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
134 ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఈ తీర్పు స్పష్టం చేసిందన్నారు.
"ఈ తీర్పును గెలుపోటముల సమస్యగా చూడవద్దు. రామభక్తి అయినా.. రహీమ్‌భక్తి అయినా ఇకపై భారతభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇది. దేశమంతా శాంతి, సామరస్యంతో కొనసాగాలి.
న్యాయ సహకారంతో ఎలాంటి వివాదమైనా పరిష్కారమవుతుందని సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రత, పారదర్శకత, ముందుచూపునకు నిదర్శనం. అందరి వాదనలు.. అన్ని కోణాల్లో విశ్లేషించాక తీసుకున్న ఈ నిర్ణయంతో న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది. "
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
సుప్రీం కోర్టు తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. దేశ చరిత్రలో ఈ తీర్పు ఓ మైలురాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
"ఈ రోజు సుప్రీంకోర్టు గొప్ప తీర్పును ఇచ్చిందని భావిస్తున్నా. ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. భారత ఐక్యత, సమగ్రత, సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుంది."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఇదీ చూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం