సాహిత్యం రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్ అవార్డు ప్రముఖ మలయాళీ కవి అక్కితంను వరించింది. మలయాళీ సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన జ్ఞాన్‌పీఠ్ ఎంపిక కమిటీ 55వ జ్ఞాన్‌పీఠ్‌కు ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
అపూర్వ రచనలు
1926లో జన్మించిన అక్కితం అసలు పేరు అక్కితం అచ్యుతన్ నంబూద్రి. ఆయన మలయాళంలో 55కు పైగా పుస్తకాలు రచించారు. అందులో 45 వరకు కవితా సంకలనాలున్నాయి. వీటిలో ఖండ కావ్యాలు, కథా, చరిత కావ్యాలున్నాయి.
కవిత్వంతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, బాల సాహిత్యం, చిన్న కథలతో సహా అనువాద రచనల్లోనూ ఆయనది అందెవేసిన చేయి. ఈయన రచనలు దేశ, విదేశీ భాషల్లోకి అనువాదం అయ్యాయి.
ప్రసిద్ధ రచనలు..
అక్కితం ప్రసిద్ధ రచనల్లో.. ఇరుప్పదం నూటందింతే ఇతిహసం ప్రముఖమైనది. వీరవదం, బలిదర్శనమ్, నిమిషా క్షేత్రం, అమృత కతికా, అక్కితం కవితక, అంతిమహాకం కూడా ప్రసిద్ధ రచనలు.
"అక్కితం అరుదైన కవి. ఆయన రచనలు (క్లాసిక్) మహోత్కృష్టమైనవి. ఆయన కవిత్వం మాటల్లో చెప్పలేని కరుణను ప్రతిబింబిస్తుంది. భారతీయ తాత్వికత, నైతిక విలువలు ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. సంప్రదాయానికి ఆధునికతకు వంతెనలా ఆయన రచనలుంటాయి. వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితుల్లో... మానవ భావోద్వేగాలను ఆయన రచనలు లోతుగా విశ్లేషిస్తాయి."
- ప్రతిభా రే, నవలా రచయిత్రి, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత
కవివరుణ్ని వరించాయి..
ఇప్పటిదాకా కేరళ నుంచి ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్న వారిలో అక్కితం ఆరో వ్యక్తి కావడం విశేషం. ఆయనను పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1973), కేరళ సాహిత్య అకాడమీ అవార్డు (1972, 1988)ను కూడా గెలుచుకున్నారు. మాతృభూమి అవార్డు, వయలార్ అవార్డు, కబీర్ సమ్మాన్ ఆయనను వరించాయి.
ఇదీ చూడండి: 'బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి'