కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈమేరకు రాసిన రాజీనామా లేఖ... దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సింధియా భేటీ అయిన కాసేపటికే వెలుగులోకి వచ్చింది.
"18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నాను. ఇప్పుడు మారే సమయం వచ్చింది. గతేడాది నుంచి జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణమని మీకు కూడా తెలుసు. ప్రజలకు, నా రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలన్నదే మొదటి నుంచి నా లక్ష్యం. కానీ... ఈ(కాంగ్రెస్) పార్టీతో కలిసి నేను ఇంకా ఆ పని చేయలేనని భావిస్తున్నా. నా ప్రజలు, అనుచరుల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త ప్రయాణం ప్రారంభించడమే సరైన పని అని విశ్వసిస్తున్నా."
-జ్యోతిరాదిత్య సింధియా
సింధియా రాజీనామా చేశారని తెలిసిన కాసేపటికే కాంగ్రెస్ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ ఆయనను కాంగ్రెస్ నుంచి బహిష్కరించేందుకు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారని ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
భాజపా వైపు అడుగులు!
మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపాతో సింధియా కలుస్తారన్న వార్తల నడుమ ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఉదయం దిల్లీలో ఇదే అంశంపై చర్చలు జరిగినట్లు సమాచారం.
భాజపాలో సింధియా చేరితే కమల్‌నాథ్ ప్రభుత్వం కష్టాల్లో పడినట్లేనని పలువురు భావిస్తున్నారు. సింధియా వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తప్పుకుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలటం ఖాయంగానే కనిపిస్తోంది.
అసంతృప్తే కారణం!
మధ్యప్రదేశ్ రాజకీయ కార్యకలాపాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవటం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానంపై సింధియా వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. 2018నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుని పార్టీకి అధికారం తెచ్చిపెట్టిన సింధియాకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అప్పటి నుంచి పార్టీపై గుర్రుగా ఉన్న ఆయన పలుసార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రెండోది.. సింధియాను రాజ్యసభకు పంపాలని ఆయన వర్గం చాలా రోజుల నుంచి పట్టుబడుతోంది. అయితే ఆయన స్థానంలో ప్రియాంక గాంధీని నామినేట్ చేయాలని పార్టీలోని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల నడుమ నిన్న తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరుకు మకాం మార్చారు.
సింధియాతో రాజీ కోసం కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వీలుగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని సీఎం కమల్‌నాథ్ నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 20 మంది మంత్రులు తమ పదవులను త్యాగం చేశారు. అయినప్పటికీ సింధియా వర్గం వెనక్కు తగ్గలేదు.