కరోనా మహమ్మారి పోరులో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. గంటల తరబడి వ్యక్తిగత భద్రత కిట్లు(పీపీఈ) ధరించి సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో వేడి, శ్వాస ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా సుదీర్ఘకాలం పీపీఈ కిట్లను ధరించిన సందర్భంలో తలెత్తుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కేరళ తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ వైద్య కళాశాల.. సరికొత్త పరికరాన్ని రూపొందించింది. 'పవర్డ్ ఎయిర్ ప్యూరిఫయింగ్ రెస్పిరేటర్'(పీఏపీఆర్) అనే పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది.
శ్రీ చిత్ర విద్యాసంస్థ శాస్త్రవేత్తల సహాయంతో.. అదే కళాశాలలో ప్రజారోగ్య సంబంధాల విభాగంలో పనిచేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ పాయ్ ఈ పీఏపీఆర్ కిట్‌ను అభివృద్ధి చేశారు.
బ్యాటరీ సాయంతో..
వైరస్‌లను అడ్డుకునే ఫిల్టర్లతో రూపొందించిన పీఏపీఆర్ కిట్టు బ్యాటరీ ద్వారా పనిచేస్తూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్వాస తీసుకునేందుకు సాయపడుతుంది. ఈ కిట్ మొత్తం ముఖాన్ని కప్పి ఉంచుతుంది. వెంటిలేటర్, అనెస్థీషియా పరికరాల్లో వినియోగించే వైరస్ ఫిల్టర్లను ఇందులో ఉపయోగించారు. ఇందులోని ఒక ఫిల్టర్ గాలిని శుభ్రపరిచి లోపలకు పంపుతుంటే.. వేడి గాలిని మరో ఫిల్టర్ బయటకు పంపిస్తుంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే.. 8-10 గంటల పాటు పనిచేస్తుంది. దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వైరస్ బారినపడకుండా శ్వాస తీసుకునేందుకు వీలుకలుగుతుందని రూపకర్తలు చెబుతున్నారు.
ఇదీ చూడండి: కరోనా సెరో సర్వేలో షాకింగ్ నిజాలు!