21 రోజుల లాక్డౌన్ కారణంగా యావత్ భారతం బంద్ అయ్యింది. మద్యం దుకాణాలూ మూతబడ్డాయి. దీంతో మందు చుక్క లేక విలవిల్లాడుతున్నారు జనం. వారి బాధను అర్థం చేసుకుని మందుబాబుల గొంతుతడిపే ప్రయత్నం చేస్తోంది కేరళ ప్రభుత్వం. మందు లేక బతకలేమన్నవారికి ప్రత్యేక 'లిక్కర్ పాస్'లు ఇవ్వాలని నిర్ణయించింది.
కేరళలో మద్యం దాహం తాళలేక ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం వైద్యులు సూచిస్తే తాగుబోతులకు మందు విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేసింది.
"దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మద్యానికి బానిసలుగా మారిన చాలామంది నిరాశ నిస్పృహలకు లోనై, ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. అలాంటివారి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం తాగక అనారోగ్యానికి గురైనవారు ప్రజా ఆరాగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ వైద్యులు అతడికి కొద్ది మోతాదులో మద్యం అందిచాల్సిందిగా రాసిస్తే.. వారికి మద్యం కొనుక్కునేందుకు అనుమతి లభిస్తుంది. "
-కేరళ ప్రభుత్వ ఉత్తర్వు
లిక్కర్పాస్ పొందండిలా..
మద్యం లేక మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురైనవారు ముందు డాక్టర్ను కలవాలి. వైద్యులు రాసిచ్చిన చీటీ తీసుకుని దగ్గర్లోని అబ్కారీ అధికారికి అందించాలి. ఆ తర్వాత లిక్కర్ పాస్లు జారీ చేస్తారు.
అయితే, వీరి కోసం మద్యం దుకాణాలు తెరిచి ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సర్కారు. లిక్కర్ పాస్లు పొందినవారు నేరుగా అబ్కారీ అధికారుల వద్దే మద్యం కొనుక్కోవచ్చని తెలిపింది.
మందు కాదు మందులివ్వాలి
మందు బానిసలకు మద్యం అందించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని భారతీయ వైద్య సంఘం(ఐఎమ్ఏ) వ్యతిరేకించింది. మద్యం లేక బలహీనతకు గురైతే ఆసుపత్రిలో చికిత్స అందించాలి కానీ, మద్యం ఇవ్వడం శాస్త్రీయంగా సరికాదని హితవు పలికింది.
ఇదీ చదవండి:'ఎక్కువ మాట్లాడండి... కరోనాను జయించండి!'