కేరళకు చెందిన భాగీరథీ, కార్తియాని బామ్మలు.. అక్షరం ముక్క రాకపోయినా ఎన్నో బాధ్యతలు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని జీవితమనే బడిలో విజయం సాధించారు. ఇరువురికీ 105, 96 ఏళ్లు నిండినప్పటికీ ఇక మాకెందుకు చదువు అనుకోలేదు. అందుకే కష్టపడి నాలుగో తరగతి పరీక్షలు రాశారు. అంతేకాదు ఒకరు 75 శాతం, మరొకరు 98 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు వీరి కష్టాన్ని గుర్తించి నారీశక్తి-2019 అవార్డును అందించనుంది కేంద్ర ప్రభుత్వం.
కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్‌లో భాగంగా 2018లో నాలుగో తరగతి పూర్తిచేశారు భాగీరథీ, కార్తియాని బామ్మలు. వయసుతో సంబంధం లేకుండా చదువు పట్ల వారు చూపిన శ్రద్ధ ఎందరికో ఆదర్శం. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో వీరి గురించి ప్రస్తావించారు.
ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నారీ శక్తి పురస్కారాన్ని అందుకోనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించనున్నారు.