సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత 'భాజపాతో కుమ్మక్కు' అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను ట్విట్టర్ వేదికగా ఖండించిన పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ తాజాగా మరో ట్వీట్ చేశారు.
"ఇది కేవలం ఒక పోస్ట్ గురించి కాదు.. ఇది నా దేశ భవిష్యత్తుకు సంబంధించినది."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
సంస్థాగత సమగ్రతను కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ పార్టీ నాయకుల్లో కపిల్ సిబల్ ఒకరు. అయితే, "కొందరు భాజపాతో కుమ్మక్కు అయ్యి సమయం సందర్భం లేకుండా" అని రాహుల్ అనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ తొలుత ట్వీట్ చేశారు సిబల్. కొద్దిసేపటికే రాహుల్ తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని, అసలు తను అలా అనలేదని స్పష్టం చేశారని చెప్పారు. అందుకే ఇంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు సిబల్. అయితే తాను చేసిన తాజా ట్వీట్ వెనుక అసలు ఉద్దేశమేంటో ఆయన వివరించలేదు.
సోమవారం సీడబ్ల్యూసీ భేటీ ముగిసిన అనంతరం గులాం నబీ ఆజాద్ నివాసానికి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు వెళ్లారు. వీరిలో ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీశ్ తివారీ, శశిథరూర్, ముకుల్ వాస్నిక్ తదితరులు ఉన్నారు. సీడబ్ల్యూసీ భేటీలో సీనియర్ల లేఖ, తీర్మానంపై చర్చించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'భాజపాతో కుమ్మక్కు'పై కాంగ్రెస్లో రగడ