దేశంలో కరోనా బాధితుల సంఖ్య 67 లక్షలు దాటింది. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకు 72 వేల 49 కొత్త కేసులు, 986 మరణాలు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఫలితంగా దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 67 లక్షల 57 వేల 132కు పెరిగింది.
కరోనా కారణంగా.. ఇప్పటివరకు లక్షా 4 వేల 555 మంది మృతి చెందారు. మొత్తంగా 57 లక్షల 44 వేల 694 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 9 లక్షల 7 వేల 883 యాక్టివ్ కేసులున్నాయి.
మంగళవారం ఒక్కరోజే 11 లక్షల 99 వేల నమూనాలు పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 8 కోట్ల 22 లక్షల 71 వేల టెస్టులు చేసినట్లు స్పష్టం చేసింది.
రికవరీల్లో 'యూటీ'ల జోరు
భారత్లో రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 84.7 శాతానికి చేరింది. దాద్రానగర్ హవేలీ, దమన్ దీవ్ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధికంగా 96.70 శాతం మంది బాధితులు కోలుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు(93.80శాతం) ఉన్నాయి.
కేంద్ర వైద్య శాఖ గణాంకాల ప్రకారం బిహార్, తమిళనాడులో రికవరీ రేటు 93.40 శాతం ఉండగా.. ఏపీలో 92.10 శాతం, దిల్లీలో 90.20, హరియాణాలో 90.10, పశ్చిమ్ బంగ 88, యూపీలో 87.80 శాతం ఉంది. మొత్తంగా 56.6 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.