కరోనా ధాటికి కుదేలైన దేశాల్లో భారత్ ఒకటి. ఈ మహమ్మారి దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికీ ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది.
ప్రతి పది లక్షల కేసుల్లో 81 కంటే తక్కువగానే మరణాలు నమోదవుతున్నాయి. అక్టోబర్ 4 నుంచి మరణాల రేటు క్షీణిస్తోంది. ప్రస్తుతం 1.52 శాతంగా ఉన్న ఈ రేటు.. మార్చి 22 నుంచి తొలిసారి కనిష్ఠానికి చేరింది. మెరుగైన నియంత్రణ చర్యల వల్ల 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.
" క్రమంగా కొవిడ్-19 మరణాల రేటు తగ్గుతోంది. ప్రస్తుతం 1.52 శాతంగా ఉంది. మార్చి 22 నుంచి తొలిసారి ఈ రేటు అత్యల్పానికి చేరింది"
-- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.
ఈ ప్రాంతాల్లో ఎక్కువగా..
పుదుచ్చేరి(403), మహారాష్ట్ర(335), గోవా (331), దిల్లీ (317), కర్ణాటక (152), తమిళనాడు(135), పంజాబ్(131)లో ప్రతి మిలియన్‌కు ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. ఇవి జాతీయ సగటు కంటే ఎక్కువ.
భారత్‌లో ప్రతి రోజు నమోదవుతున్న కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా వస్తున్నాయి. యాక్టివ్ కేసుల కంటే రికవరీలు ఎనిమిది రెట్లు పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 10.92 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,212 కొవిడ్ ఆసుపత్రులు ప్రజలకు సేవలందిస్తున్నాయి.