ETV Bharat / bharat

ఎగుమతి దృష్టితో ఆయుధ సృష్టి - రక్షణ రంగ ఉత్పత్తులు

భారత్​లోని రక్షణ పరిశ్రమలు కేవలం మన దేశ సైనిక బలగాల కోసమే ఆయుధాలను రూపొందిస్తోంది. కానీ నేటి పరిస్థితుల్లో సొంత అవసరాలు తీర్చుకుంటూనే అంతర్జాతీయ విపణులకు ఎగుమతి చేయడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఫలితంగా మనకు విదేశీ మారక ద్రవ్యం సమకూరడం మాత్రమే కాక, మరింతగా రక్షణ రంగ పరిశోధనలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

India should think about Weapon creation with export focus
ఎగుమతి దృష్టితో ఆయుధ సృష్టి
author img

By

Published : Mar 20, 2020, 8:57 AM IST

రక్షణ పరిశ్రమలు కేవలం భారతీయ బలగాల కోసమే ఆయుధ ఉత్పత్తి సాగిస్తే వేగంగా ఎదగలేవు. సొంత అవసరాలను తీర్చుకుంటూనే ఆయుధాలను అంతర్జాతీయ విపణికి ఎగుమతి చేస్తే విదేశీ మారక ద్రవ్యం సంపాదించవచ్ఛు ఆ సొమ్మును మరిన్ని ఆధునిక ఆయుధాల పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తికి వెచ్చించి అమోఘ ఫలితాలు సాధించవచ్ఛు రక్షణ అవసరాల కోసం రూపొందించిన సాంకేతికతలు పౌర అవసరాలకూ ఉపకరిస్తాయి. అమెరికా సైన్యం తన కోసం రూపొందించుకున్న గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) నేడు ప్రపంచమంతటా ఉబర్‌, ఓలా వంటి ట్యాక్సీ సర్వీసులకూ, ఆపిల్‌, గూగుల్‌ యాప్‌లకూ కల్పతరువులా మారింది. సైనిక పరిశోధనలు వాణిజ్య వృద్ధికి తోడ్పడతాయని రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఎన్నడో నిరూపించింది. మన సైనిక దళాల కోసం డీఆర్‌డీఓ రూపొందించిన సిద్ధాహారాలు నేడు మార్కెట్‌లో పౌరులకు అందుబాటులో ఉన్నాయి. డీఆర్‌డీఓ సాంకేతికతను ఉపయోగించి అనేక కంపెనీలు ‘రెడీమేడ్‌’ చపాతీలు, కూరలను తయారు చేస్తున్నాయి. ఇదే నైపుణ్యాన్ని అత్యాధునిక ఆయుధ తయారీలోనూ ప్రదర్శించాలి. అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు ఈ బాటలో ఎంతో ముందుండగా, తాజాగా చైనా ఈ బాటలో వడివడిగా అడుగులు వేస్తోంది. భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి కార్యకలాపాలు పూర్తిస్థాయిలో వేళ్లూనుకోకపోవడంతో ఇప్పటికీ విదేశీ ఆయుధ దిగుమతులపై ఆధారపడక తప్పడం లేదు. భారత్‌ ఆయుధ ఎగుమతిదారుగా అవతరిస్తే చేకూరే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.

ప్రైవేటు రంగానికీ స్థానం

ఒకప్పుడు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు (ఓఎఫ్‌), ప్రభుత్వరంగ రక్షణోత్పత్తుల సంస్థ (డీపీఎస్‌యూ)లు మాత్రమే సాయుధ బలగాలకు కావలసిన అస్త్రశస్త్రాలను తయారుచేసేవి. వాటిలో అత్యధికం తుపాకులు, బుల్లెట్లు, బూట్లు, రాడార్ల వంటి చిన్న తరహా వస్తువులే. యుద్ధ విమానాలు, ట్యాంకులు, ఫిరంగులు, యుద్ధ నౌకల వంటి భారీ ఆయుధాలకు కావలసిన సాంకేతికతను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, లైసెన్సు పద్ధతిపై తయారుచేసుకుంటున్నాం. ఇలా చిన్నదానికి పెద్దదానికి విదేశాల మీద ఆధారపడటం తగ్గించి ఆయుధోత్పత్తిలో స్వావలంబన సాధించాలని ఎన్డీయే ప్రభుత్వం ‘మేకిన్‌ ఇండియా’ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు రంగానికి పాత్ర కల్పించింది. 2015-16లో ఆయుధ సామగ్రి సరఫరా కాంట్రాక్టులలో 39.06 శాతాన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వగా, 2019-20కి వచ్చేసరికి అవి 75.03 శాతానికి పెరిగాయి. 2015-16 నుంచి 2020 జనవరి వరకు విదేశీ ఆయుధ విక్రేతలకు 100 కాంట్రాక్టులు ఇస్తే, భారతీయ ప్రైవేటు సంస్థలకు 158 కాంట్రాక్టులను ఇచ్చారు. మేకిన్‌ ఇండియా కింద ఆయుధోత్పత్తికి స్వదేశీ, విదేశీ సంస్థల మధ్య సహకార ఒప్పందాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రక్షణ రంగంలో నేడు ఎల్‌ అండ్‌ టీ హెవీ ఇంజినీరింగ్‌, టాటా గ్రూప్‌, భారత్‌ ఫోర్జ్‌ సంస్థలు చాలా చురుగ్గా ముందుకెళుతున్నాయి. గస్తీ నౌకలు, హెలికాప్టర్లు, కోస్తా నిఘా వ్యవస్థలు, రాడార్‌ విడిభాగాల తయారీలో పాలుపంచుకొంటున్నాయి.

ప్రతికూలతలను అధిగమిస్తూ

భారత్‌లో మొట్టమొదటిసారిగా ఎన్డీయే ప్రభుత్వం 2014 ఆగస్టులో రక్షణోత్పత్తుల ఎగుమతి విధానంతో ముందుకొచ్చింది. ఈ విధానం మెల్లమెల్లగా ఫలితాలనిస్తోంది. 1991లో ప్రపంచ ఆయుధ ఎగుమతిదారులలో 40వ స్థానంలో ఉన్న భారతదేశం 2019లో 23వ స్థానానికి ఎగబాకిందంటే సర్కారు ఇచ్చిన ప్రాధాన్యమే కారణం. భారతీయ ఆయుధాలకు మియన్మార్‌, శ్రీలంక, మారిషస్‌ దేశాలు పెద్ద ఖాతాదారులు. మనకన్నా అభివృద్ధి చెందిన దేశాలకూ కొన్ని రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థితికి చేరుకోవడం శుభ పరిణామం. రష్యాతో కలసి భారతదేశం తయారు చేసిన బ్రహ్మోస్‌ సూపర్‌ సానిక్‌ క్షిపణి కొనుగోలుకు ఫిలిప్పీన్స్‌ సుముఖత కనబరుస్తుంటే, భారత్‌ సొంతగా తయారు చేసిన తేజస్‌ ఫైటర్‌ విమానం పట్ల కొన్ని గల్ఫ్‌ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే, భారతదేశ మొత్తం ఎగుమతుల్లో ఆయుధ ఎగుమతుల వాటా ఇప్పటికీ 0.8 శాతంకన్నా తక్కువగా ఉండటం, అంతర్జాతీయ ఆయుధ వ్యాపారంలో మన వాటా 0.2 శాతాన్ని మించకపోవడం ఏమీ ఆశాజనకంగా లేదు. అయినా భారత ప్రభుత్వం ఎగుమతుల వృద్ధికి కట్టుబడి ఉంటానంటోంది. 2025కల్లా 500 కోట్ల డాలర్ల (దాదాపు రూ.40,000 కోట్ల) ఆయుధ ఎగుమతులు చేయాలని 2018లో వెలువరించిన ముసాయిదా రక్షణోత్పత్తుల విధానం లక్షిస్తోంది. ఈ విధానం ప్రైవేటు ఆయుధ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞాన బదిలీని అనుమతిస్తోంది. డీఆర్‌డీఓ అత్యాధునిక అస్త్రాలను రూపొందించి, వాటి ఉత్పత్తిని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని నిపుణులు సూచిస్తున్నారు. తదనుగుణంగా డీఆర్‌డీఓ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల తయారీ పరిజ్ఞానాన్ని ఎంకేయూ లిమిటెడ్‌ అనే కంపెనీకి అప్పగించింది. ఈ అంగీలను మరింత మెరుగ్గా తయారు చేసుకోవడానికి ఆర్‌ అండ్‌ డీని కొనసాగించే అవకాశం ఎంకేయూకు ఇచ్చారు. తాజాగా మరో 15 కంపెనీలకు లైసెన్సులిచ్చారు. నేడు మన సాయుధ బలగాల వినియోగానికి, విదేశాలకు ఎగుమతి చేయడానికి ఏటా 10 లక్షల బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను తయారుచేయగల స్థితికి భారత్‌ ఎదిగింది. ఈ అంగీలను నేడు 18 దేశాలకు ఎగుమతి చేస్తున్న భారతదేశం ఒకప్పుడు వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం 1.86లక్షల మంది భారతీయ సైనికులకు స్వదేశీ అంగీలను సమకూర్చారు.

రక్షణ రంగంలో 2014 వరకు కేవలం 217 లైసెన్సులు ఇవ్వగా, ఆ తరవాత అయిదేళ్లలో 460 లైసెన్సులు ఇచ్చారు. ఇటీవల లఖ్‌నవూలో జరిగిన రక్షణ రంగ ప్రదర్శన (డిఫెక్స్‌పో)లో 172 విదేశీ ఆయుధ ఉత్పత్తిదారులతోపాటు 800 పైచిలుకు భారతీయ రక్షణ సంస్థలు పాల్గొన్నాయి. 2018-19లో భారత్‌లో మొత్తం రూ.80,000 కోట్ల రూపాయల ఆయుధాలు, రక్షణ పరికరాలు ఉత్పత్తి కాగా, అందులో ప్రైవేటు రంగం వాటా రూ.16,000కోట్లుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. మన రక్షణోత్పత్తుల పరిశ్రమను 2025కల్లా 2,600కోట్ల డాలర్ల (రూ.1,92,000 కోట్ల) స్థాయికి తీసుకెళ్లాలని లక్షిస్తున్నట్లు తెలిపారు. భారతీయ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిసి విమానాలు, నౌకలు, ఇతర ఆయుధాలు తయారుచేయడానికి ముందుకొస్తున్న విదేశాలు, ఇక్కడి నుంచి కొన్ని ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనుమతిస్తామంటున్నాయి. బ్రహ్మోస్‌ క్షిపణి ఇందుకు చక్కని ఉదాహరణ. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుధ ఎగుమతుల కోసం మన గడ్డపై రక్షణ పరిశ్రమలు స్థాపించాల్సిందిగా విదేశీ కంపెనీలను కోరారు. ఇటీవల లఖ్‌నవూలో జరిగిన రక్షణ ప్రదర్శనలో మాట్లాడుతూ, తాను అధికారంలోకి వచ్చిన 2014లో భారతీయ రక్షణ ఎగుమతుల విలువ కేవలం రూ.2,000 కోట్లనీ, 2019కి అవి రూ.17,000 కోట్లకు పెరిగాయని చెప్పారు. నేడు భారతీయ ఆయుధ సామగ్రి 42 దేశాలకు ఎగుమతి అవుతోంది. వీటిలో అమెరికా, జపాన్‌, జర్మనీ, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలూ ఉన్నాయి. ఆస్ట్రేలియాకు తూటా కేసింగ్‌లను, జర్మనీకి హెల్మెట్లు, బాంబు పేలుడును నియంత్రించే దుప్పట్లు, మృదువైన కవచ ప్యానెళ్లను ఎగుమతి చేస్తున్నాం. మోర్టార్‌ గుళ్ల కవర్లను ఇజ్రాయెల్‌కు, కఠిన కవచాలను నెదర్లాండ్స్‌, అమెరికాలకూ; రాడార్‌ విడిభాగాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను సింగపూర్‌కు, డిటొనేటర్లను, దక్షిణాఫ్రికాకు, దేహరక్షక పరికరాలను జపాన్‌కు ఎగుమతి చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు తెలిపింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, దూరప్రాచ్య దేశాలకు తూటాలు, రాత్రి పూట చూడగలిగే సాధనాలను ఎగుమతి చేస్తోంది. అజర్‌ బైజాన్‌కు హెల్మెట్లు, కఠిన కవచ ప్లేట్లు, గినియాకు స్లీపింగ్‌ సంచులు ఎగుమతి చేస్తున్నాం. ఇంకా సురినాం, సెషెల్స్‌, నమీబియా దేశాలకు హెలికాప్టర్లను, మలేసియాకు సుఖోయ్‌ విమానాల ఏవియానిక్స్‌ను, అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, దక్షిణ కొరియాలకు సిమ్యులేషన్‌ సిస్టమ్‌లను ఎగుమతి చేశాం. వియత్నాం, మారిషస్‌, మియన్మార్‌ దేశాలకు పహరా నౌకలు ఎగుమతి అయ్యాయి.

ఎఫ్​డీఐల కోసం కృషి

మన ఆయుధాల ఎగుమతులను మరింత పెంచడానికి కొత్తగా 10 విభాగాలను ఏర్పరచి, 10 మంది డిఫెన్స్‌ అటాషే(రక్షణ ప్రతినిధు)లను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. 34 దేశాలకు ఆయుధ ఎగుమతులను పెంపొందించడానికి ఈ విభాగాలు కృషి చేస్తాయి. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని రక్షణ మంత్రి ప్రకటించారు. రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) తీసుకురావడానికి డిఫెన్స్‌ అటాషేలు కృషి చేస్తారు. భారత ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ(డీపీఎస్‌యూ)లు వియత్నాం, సింగపూర్‌, ఒమన్‌, మియన్మార్‌లలో మార్కెటింగ్‌కు సమన్వయ కార్యాలయాలను తెరిచాయి. భారతీయ రక్షణ అవసరాలను తీర్చడానికే తమకు సరిగ్గా ఆర్డర్లు రావడం లేదని వాపోతున్న డీపీఎస్‌యూలు, ఎగుమతులను ఎలా పెంచగలుగుతాయో అంతుచిక్కడం లేదు. అయిదు డీపీఎస్‌యూలు, నాలుగు నౌకా నిర్మాణ సంస్థలకు కొత్త ఆర్డర్లు రాకపోతే మరి రెండేళ్లలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవలసిన దుస్థితి దాపురిస్తుంది. రక్షణ పరిశ్రమలకు నిధుల కొరత తీర్చి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే ఎగుమతులకు వెసులుబాటు లభిస్తుంది. కొన్ని డీపీఎస్‌యూలలో కేవలం ఎగుమతుల కోసమే ప్రత్యేక యూనిట్లను నెలకొల్పాలి. విదేశీ ఆయుధోత్పత్తి సంస్థలతో కలసి సంయుక్తంగా ఎగుమతులు చేపట్టడానికి ప్రాధాన్యమివ్వాలి. ఆధునిక ఆయుధాలకు సంబంధించి మేధాహక్కులను పరిరక్షిస్తామని భరోసా ఇవ్వాలి. భారత్‌లో ఆయుధాలను తయారు చేసి, ఎగుమతి చేయడం అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి దేశాలకు ఆకర్షణీయంగా మార్చాలి.

- ఏఏవీ ప్రసాద్​ (రచయిత)

ఇదీ చూడండి: నిర్భయకు న్యాయం- మానవ మృగాళ్లకు ఉరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.