లోక్‌సభలోని సెక్రటేరియట్లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. కొవిడ్-19 బారిన పడినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే అతడు గత కొన్నిరోజులుగా ఉద్యోగానికి రావట్లేదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ బాధితుడు జ్వరం, దగ్గు, శ్వాసకోస సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని.. ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఆ వ్యక్తి కుటుంబంలోని 11 మందికి పరీక్షలు చేసి.. స్వీయ నిర్బంధం సూచించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అయితే వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు.
ఎవ్వరికీ లేదు..!
రాష్ట్రపతి భవన్ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలపై అధికారిక వర్గాలు స్పందించాయి. ఏ ఒక్కరికీ కరోనా పాజిటివ్ రాలేదని ప్రకటన విడుదల చేసింది రాష్ట్రపతి భవన్ సచివాలయం. భవన్ సిబ్బందికి నిత్యం పరీక్షలు జరగుతున్నాయని, ఎక్కడా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించలేదని స్పష్టం చేసింది.
సిబ్బంది బంధువుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చాయని.. వెంటనే అందర్నీ పరీక్షలకు పంపించినట్లు తెలిపారు అధికారులు. దాదాపు 115 కుటుంబాలను స్వీయ నిర్భంధంలోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.