కరోనా వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాల నుంచి వైరస్ సోకే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సరైన జాగ్రత్తలు పాటిస్తే వైద్యులు, కుటుంబ సభ్యులు... వైరస్ బారినుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు రోగుల మృతదేహాల ఖననంపై మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం.
"కొవిడ్-19 ప్రధానంగా తుంపర్ల ద్వారానే వ్యాపిస్తుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తే మృతదేహం నుంచి రోగి కుటుంబ సభ్యులు, వైద్యులకు కరోనా ముప్పు ఉండదు. శవపరీక్ష నిర్వహించే సమయంలో ఉపిరితిత్తుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కరోనా సోకే ప్రమాదం ఉంది."
- మార్గదర్శకాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ
మృతదేహాలను ఖననం చేసే సిబ్బందికి పలు సూచనలు చేసింది కేంద్రం. శవాలను ముట్టుకునే సమయంలో మాస్కులు, గ్లౌజులు వినియోగించాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మార్గదర్శకాల్లో తెలిపింది. కుటుంబసభ్యుల చివరిచూపు కోసం శవాన్ని ఉంచిన సంచి తల భాగంలో తెరవాలని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఐసోలేషన్ గదిలో ఉన్న మృతదేహాలను చూసేందుకు అనుమతించవచ్చని స్పష్టం చేసింది.
శరీరాన్ని ముట్టుకోకుండా చేసే కర్మకాండలను అనుమతిస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. బుడిద నుంచి వైరస్ సోకే ప్రమాదం లేనందున అస్థికలను కుటుంబసభ్యులు తీసుకెళ్లవచ్చని తెలిపింది. శ్మశానానికి ఎక్కువ మంది జనం గుమిగూడకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. కొత్త వైరస్ కావడం వల్ల మృతదేహాల ఖననంపై పలు సందేహాలు ఉన్నాయని... వాటిని నివారించే ప్రయత్నం చేసేందుకే ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు స్పష్టం చేసింది.
137 కేసులు
భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య 137కి చేరినట్లు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వైరస్ సోకిన వారికి దగ్గరి సంబంధం ఉన్న 5,700 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా కేసులను పరీక్షించడానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు.