దేశంలో తొలి గాడిద పాల డెయిరీ హరియాణాలో ఏర్పాటు కాబోతుంది. హిస్సార్‌లోని గుర్రపు జాతులపై జాతీయ పరిశోధన కేంద్రం (ఎన్ఆర్సీఈ) మార్గదర్శకత్వంలో ఈ డెయిరీని ఆవిష్కరించనుంది హరియాణా ప్రభుత్వం.
పాల పరిశ్రమలో ఇప్పటివరకు ఆవు, గేదె, మేక లేదా ఒంటె పాలను మాత్రమే సరఫరా చేసేవారు. కానీ ఇప్పుడు జెన్నీ పాలు (ఆడ గాడిద పాలు) కూడా మార్కెట్లో లభించనున్నాయి. ఈ గాడిద పాలను లీటరుకు రూ.2 వేల నుంచి 7 వేల వరకు విక్రయించనున్నారు.
హలరీ జాతి..
ఈ డెయిరీ కోసం గుజరాత్‌కు చెందిన 10 హలరీ జాతి గాడిదలను ఎన్ఆర్సీఈ సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇవి సంతానోత్పత్తి ప్రక్రియలో ఉన్నాయి. ఇది పూర్తి కాగానే డెయిరీ ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఎన్ఆర్సీఈతో పాటు కమల్స్ సెంట్రల్ బఫెలో రీసెర్చ్ సెంటర్, జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఇందులో భాగం పంచుకోనున్నారు.
ఔషధ విలువలు..
ఈ గాడిద పాలపై ఎన్ఆర్సీఈ మాజీ డైరెక్టర్ డాక్టర్ బీఎన్ త్రిపాఠి పరిశోధన ప్రారంభించారు. హలరీ గాడిద పాలల్లో చాలా ఔషధ లక్షణాలు నిండి ఉన్నాయని గుర్తించారు. ఇవి క్యాన్సర్, ఊబకాయం, అలెర్జీలను తగ్గించటంలో దోహదపడతాయని సీనియర్ శాస్త్రవేత్త అనురాధ భరద్వాజ్ తెలిపారు.
ఈ పాలు మానవ శరీర రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయని ఎన్ఆర్సీఈ డైరెక్టర్ యశ్పాల్ వెల్లడించారు. తక్కువ కొవ్వు ఉండటం వల్ల మానవుల శరీరానికి మంచిదని సూచిస్తున్నారు.
సౌందర్య సాధనాలు..
గాడిద పాలతో సౌందర్య సాధనాల ఉత్పత్తులపైనా భరద్వాజ్ పరిశోధనలు చేస్తున్నారు. ఆమె పరిశోధనల ఆధారంగా సబ్బులు, లిప్ బామ్, బాడీ లోషన్ తయారు చేయనుంది కేరళకు చెందిన ఓ సంస్థ.
ఇదీ చూడండి: ఖగోళంలో ప్రపంచ దేశాల 'ఖనిజాల వేట'!