హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపట్టింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టారు ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా. అనంతరం ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ట్వీట్ చేశారు.
" రాష్ట్ర యువతకు ఇది ఒక చారిత్రక రోజు. హరియాణాలోని ప్రైవేటు సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే ఇచ్చేలా చేసే ముసాయిదా ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం స్థానిక యువతకు మేలు చేకూర్చనుంది."
- దుష్యంత్ చౌతాలా, ఉప ముఖ్యమంత్రి, హరియాణా
ఆంధ్రా బాటలో...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. పరిశ్రమలు/ఫ్యాక్టరీలు, పీపీపీ ప్రాజెక్టుల్లో స్థానికులకు 75 శాతానికి తగ్గకుండా ఉపాధి/ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొంటూ గతేడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం 'ఏపీ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్/ఫ్యాక్టరీస్ చట్టం-2019ట తీసుకొచ్చింది. సెక్షన్ 3 ప్రకారం 75% ఉద్యోగాలు స్థానిక అభ్యర్థులకే ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిలో విఫలమైతే సెక్షన్ 8 ప్రకారం యాజమాన్యానికి జరిమానా విధించవచ్చని పేర్కొంది.